
కొందరు ఆమెను దివ్వెల మాధురి అంటారు. కొందరు దువ్వాడ మాధురి అంటారు. ఎవరు ఎలా పిలిచినా.. దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటూ సోషల్ మీడియాకు, బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన మాధురి సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ‘చీన్ టపాక్ డుం డుం’ అనే ఒక వినోదాత్మక చిత్రంలో ‘గైరమ్మత్త’ పాత్రలో మాధురి నటించింది. ఆమె ఫస్ట్ లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది.
మాధురి ఎక్కడ నుంచి ఎక్కడికో వెళ్లిపోయిందని ఆమె అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘రంగ స్థలం’లో అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ఆమెకు ఎంత గుర్తింపు తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ‘గైరమ్మత్త’ పాత్రతో ‘రంగమ్మత్త’కు మాధురి పోటీ ఇస్తుందేమోనని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మాధురి ఫస్ట్ లుక్ మాత్రం ఇంప్రెసివ్ గానే ఉంది. ఈ సినిమాకు కొంత అటెన్షన్ అయితే తీసుకొచ్చింది.
సమంత నిర్మాతగా చేసిన ‘శుభం’ సినిమాలో నటించిన గవిరెడ్డి శ్రీను ఈ ‘చీన్ టపాక్ డుం డుం’ సినిమాలో హీరోగా చేశాడు. జనవరి 2026లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వైఎన్ రోహిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విలేజ్ టాకీస్ బ్యానర్ పై నాగులపల్లి శ్రీను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గవిరెడ్డికి జంటగా బ్రిగిడ సాగా నటిస్తుంది.
ఈ సినిమా పూజా కార్యక్రమానికి సమంత స్వయంగా హాజరై ముహూర్తమ్ షాట్కు క్లాప్ కొట్టడం విశేషం. సోషల్ మీడియాలో గడుసైన తన మాటలతో ట్రోలర్స్, మీమర్స్కు ట్రెండింగ్ టాపిక్ అయిన మాధురి ఈ సినిమాతో వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండటం విశేషం.