Reading Time: < 1 minute

ఏకనాలో హై-వోల్టేజ్ డ్రామా.. సూపర్ ఓవర్‌లో లక్నోపై కేకేఆర్ ఘన విజయం

Caption of Image.

ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఏకనా స్టేడియంలో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య పోరు నరాలు తెగే ఉత్కంఠను పంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సమాన పరుగులు చేయడంతో మ్యాచ్ ‘సూపర్ ఓవర్’కు దారితీసింది. ఈ సీజన్‌లోనే నమోదైన తొలి సూపర్ ఓవర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది.

కాగా మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్, రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ (83)తో 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో చివరి బంతిని మహమ్మద్ షమీ ( Shami) సిక్స్ కొట్టడంతో సరిగ్గా 155 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ ఉత్కంఠ భరిత పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో కోల్‌కతా ముందు నామమాత్రపు లక్ష్యం నిలిచింది.

కేవలం రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఏమాత్రం తడబడకుండా మొదటి బంతినే రింకు సింగ్ ఫోర్ కొట్ట డంతో లక్ష్యాన్ని ఛేదించి సంబరాల్లో మునిగిపోయారు. ఈ మ్యాచులో మొహిసిన్ ఖాన్ ఐదు వికెట్ల ప్రదర్శనతో కేకేఆర్ ఓటమి ఖాయమనిపించినా, రింకూ సింగ్ పోరాటం.. ఆపై బౌలర్ల సమష్టి కృషి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాయి. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ సూపర్ ఓవర్ పోరు అభిమానులకు అసలైన ఐపీఎల్ మజాను అందించింది. 

 

 

©️ VIL Media Pvt Ltd.