
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆదివారం ( ఏప్రిల్ 26 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. పొన్నారం గ్రామంలో 226 ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఈ రోజు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా పేదప్రజలకు ఇవ్వలేదని.. కేసీఆర్, కేటీఆర్ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు వంశీకృష్ణ.
ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు ఆత్మ గౌరవంతో సొంత ఇంటిలో బ్రతకాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందని… రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా.. ఇందిరమ్మ హయంలో పంపిణీ చేసిన విధంగానే పెద వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్ లు ఫాంహౌస్ లు కట్టుకున్నారు తప్ప ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు.తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని..కేటీఆర్, కేసీఆర్ లు తెలంగాణ సంపదను ఎలా దోచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకొన్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.