Reading Time: < 1 minute

తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు వివాదం ..ఊరిపేరులో కులం పేరు తొలగించని అధికారులు..ఎస్సీ, ఎస్టీ కమిషన్ చర్యలు

Caption of Image.

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఓ వార్డు పేరులో కులం పేరు తొలగింపు వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ గ్రామంలోని వార్డుపేరులో కులం పేరు ఉంది అది  తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఎస్సీ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారు ఉత్తర అచంతవీర్థన్ (వార్డు 12) ప్రజలు. ఈ విషయంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారులు  తొలగించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులు. విచారణకు స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్  వివరణ ఇవ్వాలని, వారంరోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో హాట్ టాపక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. 

శ్రీవిల్లిపుత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వార్డు పేరు నుంచి కులం పేరును తొలగించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎస్సీ/ఎస్టీ కమిషన్) విరుదునగర్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

ఉత్తర అచంతవీర్థన్ (వార్డు 12) విరుదునగర్ జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గంలో ఒక భాగం. ఈ వార్డు పేరుకు ‘పరసేరి’ అనే కుల ఆధారిత జత చేసి ఉంది. ఆ పేరును తొలగించాలని ఆ ప్రాంత ప్రజలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.ఈ పేరును తొలగించనందుకు ప్రభుత్వాన్ని ఖండిస్తూ, ఆ వార్డు ప్రజలు 2026 అసెంబ్లీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించారు కూడా.

ఇప్పుడు ఈ విషయం  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి రావడంతో అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కమిషన్ తాత్కాలిక ఛైర్మన్, కార్యదర్శి హిమయం ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అందులో, కులం పేరు తొలగించకపోవడానికి గల కారణం, దీనికి బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యల గురించి వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, రెవెన్యూ శాఖ పరిధిలోని రోడ్డు, నివాస ప్రాంతాల పేర్లనుంచి కులం పేర్లను తొలగించాలని ప్రభుత్వం ఇప్పటికే  ఆదేశించింది. అయితే శ్రీవిల్లి పుత్తూరులో అధికారులు నిర్లక్షం చేయడంతో అది జరగలేదు. ఎన్నికలను బహిష్కరించేంత వరకు వెళ్లిన ఈ అంశం, ఇప్పుడు కమిషన్ జోక్యం తర్వాత మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. 

©️ VIL Media Pvt Ltd.