Reading Time: < 1 minute

సరోగసీ కేసులో ఈడీ అరెస్ట్‌‌ రద్దుకు నిరాకరణ…డాక్టర్‌‌ నమ్రత పిటిషన్‌‌ కొట్టివేసిన హైకోర్టు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: సరోగసీ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) అక్రమ అరెస్ట్‌‌ను రద్దు చేయాలన్న డాక్టర్‌‌  పచ్చిపాల నమ్రత అలియాస్‌‌  అతలూరి నమ్రత పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రత్యామ్నాయ అవకాశాలైన బెయిలు కోరడానికి అవకాశం ఉండగా నేరుగా అరెస్టు రద్దు కోరడాన్ని అనుమతించమలేమని, దర్యాప్తు కొనసాగుతున్న ఇలాంటి కేసుల్లో హైకోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సరోగసీ అక్రమాలు, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి నమోదైన కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 12న డాక్టర్‌‌  నమ్రత అరెస్టు అయ్యారు. అరెస్ట్​తోపాటు రిమాండ్‌‌  ఉత్తర్వులను రద్దుచేసి విడుదల చేయాలని కోరుతూ నమ్రత.. హైకోర్టులో ఇటీవలే పిటిషన్‌‌  దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌  పి.శ్యాంకోశీ, జస్టిస్‌‌  నందికొండ నర్సింగ్‌‌రావుతో కూడిన బెంచ్‌‌ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. 

పిల్లలులేని దంపతులు తీవ్రమైన నిరాశతో సంతానోత్పత్తి కేంద్రాలను ఆశ్రయిస్తారని, తమ కన్నబిడ్డను ఇంటికి తీసుకెళుతున్నామని నమ్మకంతో ఉన్న తల్లిదండ్రులు బిడ్డ తమది కాదని తెలిస్తే జీవితాంతం నిస్సహాయతతో కుమిలిపోతారని వ్యాఖ్యానించింది. ఈడీ ప్రత్యేక కోర్టులో బెయిలు పిటిషన్‌‌  దాఖలు చేసుకోవడానికి పిటిషనర్‌‌కు అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. దర్యాప్తు రికార్డు, రిమాండ్‌‌  డైరీ, ఎఫ్‌‌ఐఆర్‌‌లు, సోదాలు, స్వాధీనం చేసుకున్న రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వాంగ్మూలాలు పరిగణనలోకి తీసుకుంటే దర్యాప్తు సంస్థ ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించలేదన్న పిటిషనర్‌‌ వాదనను బెంచ్‌‌ తిరస్కరించింది. వీటన్నింటినీ ప్రత్యేక కోర్టు ముందుంచి తేల్చుకోవాలని పిటిషన్‌‌ను కొట్టివేసింది.

©️ VIL Media Pvt Ltd.