
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 17 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది . పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పెంచాలని తమిళగ వెట్రి కజగం అధినేత, దళపతి విజయ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు అత్యవసర లేఖ రాశారు.
చెన్నైలోని కోయంబేడు, కిళంబాక్కం వంటి ప్రధాన బస్ టెర్మినళ్లలో వేలాది మంది ఓటర్లు చిక్కుకుపోయారని విజయ్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను వారి పోలింగ్ బూత్‌లకు చేర్చడంలో రాష్ట్ర రవాణా సంస్థ విఫలమైంది. ఇది ఓటు వేసే ప్రాథమిక హక్కుపై జరుగుతున్న దాడి అని విమర్శించారు. ఎన్నికల విధులకు బస్సులను వినియోగిస్తున్నప్పుడు, సాధారణ ప్రజల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వ్యవస్థాగత వైఫల్యమేనని ఆయన ఎత్తి చూపారు.
ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా విజయ్ ప్రధానంగా రెండు డిమాండ్లను ఈసీ ముందు ఉంచారు. బస్ టెర్మినళ్లలో చిక్కుకున్న వారిని తరలించేందుకు తక్షణమే అదనపు బస్సులు, షటిల్ సర్వీసులను ఏర్పాటు చేయాలి. ప్రయాణ అంతరాయాలు , పోలింగ్ కేంద్రాల్లో పెరుగుతున్న క్యూ లైన్లను దృష్టిలో ఉంచుకుని, పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు, అంటే రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని కోరారు.మరోవైపు పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని విజయ్ కోరారు.
నీలన్‌కరైలో ఓటు వేసిన విజయ్ ఈ ఎన్నికల్లో పెరంబూర్ , తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్‌లో డీఎంకే సీనియర్ నేత ఆర్.డి. శేఖర్‌తో, తిరుచిరాపల్లిలో ఇనిగో ఇరుదయరాజ్‌తో ఆయన తలపడుతున్నారు.