
- ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ప్రకటన
కాచిగూడ, వెలుగు : ఆర్టీసీ కార్మికుల సమ్మె, సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ చొరవ చూపి, మళ్లీ చర్చలకు పిలవాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము ప్రభుత్వంతో మళ్లీ చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో బర్కత్‌పుర డిపో వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఆర్టీసీకి నెలకు రూ.350 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇవ్వడం లేదని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు. ప్రైవేట్ సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలోకి తీసుకోవద్దని, ఆర్టీసీ యాజమాన్యమే కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.