Reading Time: 2 minutes

పీసీ ఘోష్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌పై చర్యలు వద్దు ..రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

Caption of Image.
  • కేసీఆర్‌‌‌‌, హరీశ్‌‌రావు, ఐఏఎస్​ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌‌కే జోషికి ఊరట
  • ప్రజాప్రయోజనాల పరిరక్షణకే విచారణ కమిషన్‌‌ ఏర్పాటు చేశారన్న కోర్టు
  • ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం, రాజకీయ 
  • ప్రయోజనాలు కనిపించలేదు
  • కమిషన్‌‌ ఏర్పాటు పూర్తిగా చట్టబద్ధమే!
  • కానీ ఘోష్​ కమిషన్​ సెక్షన్‌‌ 8(బీ), 
  • 8(సీ) నిబంధనలను పాటించలేదు
  • అందువల్ల నివేదిక చెల్లదన్న ధర్మాసనం 

హైదరాబాద్, వెలుగు:  జస్టిస్‌‌ పీసీ ఘోష్‌‌  ఏకసభ్య విచారణ కమిషన్‌‌  నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌రావు, ఐఏఎస్‌‌ అధికారి స్మితా సబర్వాల్, రిటైర్డు ఐఏఎస్‌‌ అధికారి ఎస్‌‌కే జోషి తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ‘కమిషన్‌‌ ఆఫ్‌‌ ఎంక్వైరీస్‌‌ యాక్ట్‌‌’ సెక్షన్‌‌ 3 ప్రకారం ప్రభుత్వం విచారణ కమిషన్‌‌ ఏర్పాటు చట్టబద్ధమేనని తేల్చి చెప్పింది.

‘‘మేడిగడ్డ కుంగిపోయిన నేపథ్యంలో  ప్రజాప్రయోజనాల పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం విచారణ కమిషన్‌‌ ఏర్పాటు చేసింది. ఇందులో  ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం, రాజకీయ ప్రయోజనాలు కనిపించలేదు. కానీ సెక్షన్‌‌ 8(బీ), 8(సీ) నిబంధనలను పాటించకుండా ఘోష్​ కమిషన్ ​ఇచ్చిన నివేదిక చెల్లదు’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కమిషన్‌‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను రద్దు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది.

కేసీఆర్, హరీశ్ రావు, ఇద్దరు ఐఏఎస్‌‌ అధికారులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను పాక్షికంగా అనుమతిస్తూ చీఫ్‌‌ జస్టిస్‌‌  అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి. ఎం.మొహియుద్దీన్​తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం తీర్పు వెలువరించింది. బుధవారం కోర్టు ప్రారంభం కాగానే డివిజన్‌‌ బెంచ్‌‌ తీర్పులోని సారాంశాన్ని సంక్షిప్తంగా ప్రకటించింది. 

మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో విచారణ కమిషన్‌‌‌‌ను ఏర్పాటుచేయడం చట్టబద్ధమేనని ధర్మాసనం అంగీకరించింది.   కానీ విచారణ తీరులో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ‘‘మేడిగడ్డ కుంగిపోయిన నేపథ్యంలో  ప్రజాప్రయోజనాల పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం విచారణ కమిషన్‌‌‌‌ ఏర్పాటుచేసింది.

కమిషన్‌‌‌‌ అఫ్‌‌‌‌ ఎంక్వైరీస్‌‌‌‌ యాక్ట్‌‌‌‌లోని నిబంధనల ప్రకారం కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేసే అధికారం  ముమ్మాటికీ ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలో జస్టిస్‌‌‌‌ పీసీ ఘోష్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో 6 సమర్థనీయమే’’ అని ధర్మాసనం వెల్లడించింది. మేడిగడ్డ కుంగిపోయిన నేపథ్యంలో నేషనల్‌‌‌‌ డ్యాం సెఫ్టీ ఆథారిటీ పరిశీలించి నివేదిక సమర్పించిందని,  బ్యారేజీ నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్న విషయాన్ని  బయటపెట్టిందని పేర్కొంది.

ఎన్డీఎస్‌‌‌‌ఏ,  కాగ్‌‌‌‌ నివేదికలతోపాటు వివిధ ఎంక్వైరీల ఆధారంగా ప్రజాధనం వృథా అయిందని, అధికార దుర్వినియోగం జరిగిందని భావించిన ప్రభుత్వం  కమిషన్​ఏర్పాటు చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘కమిషన్‌‌‌‌ ఏర్పాటులో ఎలాంటి దురుద్దేశం, రాజకీయ ప్రయోజనాలు కనిపించలేదు. ప్రజాప్రయోజనాల నిమిత్తమే కమిషన్​ ఏర్పాటు చేశామన్న ప్రభుత్వ వాదన సరైందే’’ అని హైకోర్టు స్పష్టంచేసింది.

కమిషన్​ చట్టపరమైన నిబంధనలు పాటించలేదు.. 

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా జస్టిస్‌‌‌‌ పీసీ ఘోష్‌‌‌‌ కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేయడం చట్టబద్ధమేనని, కానీ కమిషన్‌‌‌‌ నిర్వహించిన విచారణ మాత్రం చట్టపరమైన ప్రమాణాలను అనుసరించలేదని ధర్మాసనం తప్పుపట్టింది. ప్రధానంగా విచారణ కమిషన్‌‌‌‌ చట్టంలోని సెక్షన్‌‌‌‌ 8(బీ), 8(సీ)లో పేర్కొన్న నిబంధనలను పాటించకపోవడాన్ని ఎత్తిచూపింది.

కమిషన్‌‌‌‌ ముందు విచారణలో సాక్షులు చేసిన ఆరోపణలు, సమర్పించిన ఆధారాలను సంబంధిత వ్యక్తులకు తెలియజేసి, వారికి సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత కమిషన్‌‌‌‌పై ఉందని కోర్టు గుర్తుచేసింది. ఆ రెండు సెక్షన్లు అదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టంచేసింది. పిటిషనర్లకు అలాంటి అవకాశాన్ని కమిషన్‌‌‌‌ ఇవ్వకుండా, సాక్షుల వాంగ్మూలాలను ఏకపక్షంగా పరిగణనలోకి తీసుకుని నివేదిక సమర్పించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపింది.

ఈ ప్రక్రియలో ఆరోపణలు చేసిన సాక్షులను క్రాస్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌ హక్కును కూడా  పిటిషనర్లకు లేకుండాపోయిందని ఆక్షేపించింది. దీంతో పిటిషనర్లకు రాజ్యాంగం కల్పించిన సహజ న్యాయ హక్కులు దెబ్బతిన్నాయని అభిప్రాయపడింది. కమిషన్‌‌‌‌ పాత్ర కేవలం నిజనిర్ధారణకు పరిమితమని, వ్యక్తులపై నేరపూరిత ఆరోపణలు చేసి చర్యలు సూచించడం దాని అధికార పరిధిని మించిందని స్పష్టం చేసింది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యం, అవకతవకలు ఉన్నాయని కమిషన్‌‌‌‌ నివేదిక పేర్కొన్నప్పటికీ, సెక్షన్‌‌‌‌ 8 బీ, సీలను అమలు చేయనందున కమిషన్‌‌‌‌ రిపోర్టు చెల్లదని  హైకోర్టు తేల్చి చెప్పింది.

©️ VIL Media Pvt Ltd.