Reading Time: 2 minutes

గ్లోబల్ ఏజెంట్‌గా ప్రియాంక చోప్రా యాక్షన్ విధ్వంసం.. స్పై థ్రిల్లర్స్ సిటాడెల్-2 ట్రైలర్ రిలీజ్!

Caption of Image.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ వేదికపై మరోసారి తన యాక్షన్ విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. రిచర్డ్ మాడెన్, ప్రియాంక జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్ సీజన్ 2’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అధికారిక ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు, స్ట్రీమింగ్ తేదీని ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపింది.

యాక్షన్ డోస్ రెట్టింపు..

మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ఈ రెండో సీజన్ ట్రైలర్ చూస్తుంటే, మొదటి భాగం కంటే ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ డ్రామా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. మే 06 నుంచి ఈ సిరీస్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కథా నేపథ్యం..

మొదటి సీజన్‌లో సిటాడెల్ ఏజెంట్లు నాడియా సిన్ (ప్రియాంక), మేసన్ కేన్ (రిచర్డ్) తమ జ్ఞాపకశక్తిని కోల్పోయి, తిరిగి ఒకరినొకరు కలుసుకుంటారు. సీజన్ 2లో, వీరు తమ గతాన్ని పూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటూనే.. సిటాడెల్ సంస్థను ధ్వంసం చేసిన క్రూరమైన ‘మాంటికోర్’ నెట్‌వర్క్ నుంచి ప్రపంచాన్ని రక్షించే మిషన్‌లో తలపడబోతున్నారు. బెర్నార్డ్ ఓర్లిక్ (స్టాన్లీ టుచి) మళ్ళీ ఈ ఇద్దరు టాప్ ఏజెంట్లను ఏకం చేస్తాడు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న పాత గొడవలు, విభేదాలు ఇంకా పరిష్కారం కాకపోవడం కథలో మరింత ఉత్కంఠను పెంచనుంది.

కొత్త పాత్రలు.. 

ఈ సీజన్‌లో రూసో బ్రదర్స్ నిర్మాణ విలువలు సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జాక్ రేనర్, మ్యాట్ బెర్రీ, రాహుల్ కోహ్లీ వంటి అంతర్జాతీయ నటులు కొత్తగా ఈ సీజన్‌లో భాగమయ్యారు. ప్రైమ్ వీడియో ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అవుతున్న భారీ స్పై యూనివర్స్ ఇది.

ప్రియాంక బిజీ షెడ్యూల్..

ప్రస్తుతం ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై కూడా సందడి చేయబోతున్నారు. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ (SSMB29) చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. ఒకవైపు హాలీవుడ్ సిరీస్‌లు, మరోవైపు ఇండియన్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌తో ప్రియాంక తన గ్లోబల్ ఇమేజ్‌ను మరింత పటిష్టం చేసుకుంటున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.