
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ , దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఏప్రిల్10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ‘ లవ్ టుడే’, ‘ డ్యూడ్ ‘ వంటి వరుస హిట్స్ ను సొంతం చేసుకున్న ప్రదీప్ కు.. ఈ మూవీ మాత్రం తీవ్ర నిరాశ పరిచింది. ఊహించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేపోయింది.
బాక్సాఫీస్ వద్ద నిరాశ..
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.56 కోట్లు రాబట్టినట్లు సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో రూ. 45 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 11 కోట్లకు పైగా రాబట్టింది. ప్రదీప్ గత రెండు చిత్రాలు రూ. 100 కోట్ల మార్క్ ను దాటాయి. కానీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) మాత్రం ఆస్థాయిలో వసూళ్లు కలెక్ట్ చేయడం కష్టమేనని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో రన్ కొనసాగుతుంది.
ఓటీటీలోకి ఎప్పుడంటే..
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతున్న ఈ మూవీ.. మే 15న ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
కథేంటంటే?
ఈ సినిమా కథ చాలా విభిన్నంగా తెరకెక్కించారు దర్శకుడు విఘ్నేష్ శివన్ . ఈ మూవీలో హీరో తన నిజమైన ప్రేమను వెతుక్కునే క్రమంలో ఒక గ్యాడ్జెట్ సహాయంతో 2040లోకి టైమ్ ట్రావెల్ చేస్తాడు. మనసులోని భావాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోకి, భవిష్యత్తులో అన్నీ యాప్స్ , టెక్నాలజీతో ముడిపడి ఉన్న ప్రపంచం కనిపిస్తుంది. మరి ఒక యాప్ మనిషి హృదయాన్ని రీప్లేస్ చేయగలదా? టెక్నాలజీ ప్రేమను కొలవగలదా? అనే ప్రశ్నల చుట్టూ వినోదభరితంగా సాగే ప్రయాణమే ఈ చిత్రం.
కాన్సెప్ట్ బాగున్నా..
ప్రదీప్ సరసన ఈ మూవీలో కృతి శెట్టి నటించి మెప్పింది. ప్రతి సినిమాలోనూ తనదైన మార్క్ వేసే SJ సూర్య, ఇందులోనూ తన నటనతో థియేటర్లలో నవ్వులు పూయించారు. ఆయన పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుంది. కీలక పాత్రలో నటించిన సీమాన్ తన గంభీరమైన నటనతో సినిమాకు బలాన్ని ఇచ్చారు. అయితే కథనం చాలా బలహీనంగా ఉందన్న మిశ్రమ టాక్ ను మూటగట్టుకుంది. కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు కొంత తడబడ్డారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.