
అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్ జట్టు 99 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై ఘన విజయం సాధించింది. MI vs GT మ్యాచ్లో వార్ వన్ సైడ్ అయింది. ముంబై కీలక బ్యాటర్లంతా చేతులెత్తేసినా తరుణంలో తిలక్ వర్మ చేసిన సెంచరీ వృథాగా పోలేదు. ముంబై విజయంలో ఈ సెంచరీ కీలక పాత్ర పోషించింది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఏక పక్షంగా సాగింది. గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
200 పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 0-1, 5-2, 40-3, 54-4,55-5.. ఇలా గుజరాత్ జట్టు బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. సాయి సుదర్శన్ డకౌట్గా వెనుదిరగగా, గిల్ 15, బట్లర్ 5, వాషింగ్టన్ సుందర్ 26, గ్లెన్ ఫిలిప్స్ 6, రాహుల్ తెవాటియా 8, షారూఖ్ ఖాన్ 17, రషీద్ ఖాన్ 4, రబాడ 12 పరుగులు, సిరాజ్ డకౌట్ కావడంతో గుజరాత్ జట్టు ఆలౌట్ అయింది.
ఇలా 15.5 ఓవర్లకే 100 పరుగులకే గుజరాత్ టైటాన్స్ జట్టు ఆలౌట్ కావడంతో ముంబై జట్టు 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ అదరగొట్టాడు. 4 వికెట్లు తీసి గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 100 పరుగులకే గుజరాత్ జట్టు ఖేల్ ఖతం అయింది. ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు ఈ విజయంతో భారీ ఊరట దక్కింది.
గుజరాత్ టైటాన్స్ విజయాలకు ముంబై జట్టు బ్రేకులేసింది. తిలక్ వర్మ చేసిన సెంచరీ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. 45 బంతుల్లో 7 సిక్సులు, 8 ఫోర్లతో 101 పరుగులు చేసి తిలక్ వర్మ నాటౌట్గా నిలిచాడు. నమన్ ధీర్ 45 పరుగులతో రాణించాడు. పాయింట్ల పట్టికలో నిన్నమొన్నటి దాకా పదో స్థానంలో నిలిచి అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఒక్క విజయంతో ఏడో స్థానానికి ఎగబాకింది. సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ను మట్టి కరిపించి ముంబై జట్టును తక్కువ అంచనా వేయకూడదని మరోసారి రుజువు చేసింది.