
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూర్పల్లిలో రైతుల సమక్షంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేయడం గమనార్హం.
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు సాయం అందనుంది. ఇందుకోసం దాదాపు రూ.5,653 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది.
ఎకరానికి సంవత్సరానికి రూ.12వేల చొప్పున, యాసంగి సీజన్‌కు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటికే గత నెల 23న తొలి విడతలో 68,89,955 మంది రైతులకు చెందిన 57,44,907 ఎకరాల భూమికి గాను రూ.3,446.94 కోట్లు విడుదల చేశారు. మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరం వరకు పెట్టుబడి సాయం అందించారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, విడతల వారీగా అందరికీ సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.