
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తి చెరువులో పడేస్తామని ప్రకటించారు. పేద ప్రజల జీవితాలు ఆగం చేసేందుకు బోడిగుండా హైడ్రాను తీసుకొచ్చి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం (ఏప్రిల్ 20) జగిత్యాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల జీవితాలు ఆగమయ్యాయని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా దోపిడీ, గుండాగిరి, అరాచకమేనని ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా పక్కదారి పట్టిందని.. యాదవులకు గొర్రెలు లేవు, మత్స్యకారులకు చేపలు లేవని విమర్శించారు. కులవృత్తులకు ఏ పథకాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మీ కింద రూ.2500 లేవు.. స్కూటీలు కూడా ఎవరికీ రాలేదన్నారు.
‘‘ గతంలో తెలంగాణ అనే పదం పలకడానికే భయపడే రోజులు.. తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు.. మన నీళ్లు, వనరులను దోపిడీ చేశారు.. పాలమూరు వంటి జిల్లాలో 90 శాతం వలసలే.. కొన్ని పార్టీల తీరుతో ఆవేశం, బాధ కలిగేవి.. మూలిగే నక్కపై తాటిపండులా చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారు.. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలిపితే బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారు.. బషీర్‌బాగ్ ఘటనతోనే తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమానికి వచ్చా.
కేసీఆర్ రాక ముందు రాష్ట్రంలో కరెంట్ సరిగా ఉండేదా?.. మేం వచ్చాక 24 గంటల కరెంట్ ఇచ్చాం.. మరి ఇప్పుడు ఏమైంది..? ఈ దుర్మార్గులు గెలిస్తే రైతు బంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటారని చెప్పా.. నేను చెప్పినట్టే జరిగిందా? లేదా..?.. ఒకేసారి వెయ్యాల్సిన రైతు బంధును.. ఎకరానికి ఒకసారి వేస్తున్నారు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతున్నారు.. ఆయన వెయ్యి జన్మలు ఎత్తినా నేను చావను.. ఇక్కడ దరిద్రం పోయే దాకా.. అన్ని వర్గాల ప్రజలు బాగుపడే వరకు సేవ చేస్తానని అన్నారు.