
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అన్న క్యాంటీన్ దగ్గర సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా ఆయన పక్కనే ఉన్న NSG కమాండో వడదెబ్బ కారణంగా కుప్పకూలి పడబోయాడు. పక్కనే ఉన్న సీఎం సెక్యూరిటీ సిబ్బంది అతనిని కిందపడిపోకుండా పైకి లేపారు. అక్కడ నుంచి అన్న క్యాంటీన్ లోపలకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ NSG కమాండో ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మే నెలకు పది రోజుల ముందు నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటిందంటే.. అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉంది.
ఎండలు, వడగాల్పులు హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే సూచించింది. తీవ్రమైన జ్వరం, వాంతులు, వికారం, తలనొప్పి, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం, కండరాలు పట్టేయడం, వేగంగా గుండె కొట్టుకోవడం, ఊపిరి ఆడకపోవడం వడదెబ్బ లక్షణాలని, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలని, లేదంటే108 కి ఫోన్ చేసి దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్లాలని పేర్కొంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
►ALSO READ | ఏపీలో ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి.. జొన్నగిరి గోల్డ్ మైన్‌తో దిగుమతులు తగ్గుతాయా..?