Reading Time: < 1 minute

ట్రంప్ వసూలు చేసిన టారిఫ్ డబ్బు రీపేమెంట్ మెుదలు పెట్టిన అమెరికా.. దిగుమతిదారులకు రూ.14 లక్షల కోట్లు రీఫండ్

Caption of Image.

అమెరికా వాణిజ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున టారిఫ్ రీఫండ్స్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. అధ్యక్షుడు ట్రంప్ గత ఏడాది ఏప్రిల్‌లో దిగుమతులపై విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో.. వసూలు చేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను తిరిగి చెల్లించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్  ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది.

సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న ఇచ్చిన కీలక తీర్పులో.. జాతీయ అత్యవసర పరిస్థితి పేరుతో పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడు తన పరిధిని మించి ప్రవర్తించారని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 3.3 లక్షల మంది దిగుమతిదారులు చెల్లించిన 166 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.14 లక్షల కోట్లు టారిఫ్ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టారిఫ్ రీపేమెంట్‌గా నిలవనుంది.

మొదటి దశలో సుమారు 127 బిలియన్ డాలర్ల రీఫండ్‌లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 56 వేలకు పైగా కంపెనీలు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నాయి. దరఖాస్తు చేసుకున్న 60 నుండి 90 రోజుల్లోగా ఈ నగదు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు తెలిపారు. అయితే డాక్యుమెంటేషన్‌లో చిన్న తప్పు ఉన్నా రీఫండ్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ డిమాండ్ కారణంగా వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున కంపెనీలు ఓపిక పట్టాలని అధికారులు కోరుతున్నారు. చిన్న వ్యాపారవేత్తలు ఈ రీఫండ్‌ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ డబ్బు వారి వ్యాపార అవసరాలకు కొత్త ఊపిరి పోయనుంది.

©️ VIL Media Pvt Ltd.