
వంగూర్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా జిల్లాలో త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్చేశారు. ఇదే విషయమై వంగూరు మండలం రంగాపూర్ సింగిల్ విండో సొసైటీ కార్యాలయం ముందు ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మంద రాజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు అంకు సురేందర్ మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంట మార్కెట్‌కు రాకముందే కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉండేవని వారు గుర్తు చేశారు. యూరియా బస్తాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ యాప్ విధానం వల్ల రైతులకు అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మేకల కృష్ణయ్య, నరసింహారెడ్డి, రామస్వామి ఉన్నారు.