Reading Time: 2 minutes

పిల్లలకు విజ్ఞాన పాఠం.. మునికిష్టడి మాణిక్యం

Caption of Image.

నవరసాల్లో హాస్యంలాగే సాహిత్యంలో బాల సాహిత్యం సులభంగా కనిపించే కష్టమైన ప్రక్రియ. పిల్లలకు నచ్చేలా, పెద్దలూ మెచ్చేలా రాయడం ఒక ప్రత్యేకమైన కళ. చిన్నారులను దృష్టిలో ఉంచుకొని పదం, వాక్యం, భాష, శైలి ఉండాలి. నీతి, హాస్యం, బుద్ధి, విజ్ఞానం, సమయస్ఫూర్తి, ధైర్యం, పోరాటం, శ్రమ శక్తి, దేశ భక్తి వంటి సుగుణాలు బోధించేలా రాయాలి. ఈ లక్షణాలన్నింటి కలబోతకు కొన్ని ఉదాహరణలు.. పంచతంత్ర, కాశీ మజిలీ, చందమామ, మర్యాద రామన్న, అక్బర్​–బీర్బల్​ కథలు. అందుకే ఇవి ఆబాలగోపాలం మెప్పు పొందాయి. ఇప్పటికీ గొప్పవిగా నిలిచాయి. 

మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి బాల సాహిత్యంలోనూ అప్పుడప్పుడు కొన్ని మెరుగైన రచనలు వస్తున్నాయి. అలాంటిదే ‘మునికిష్టడి మాణిక్యం’ నవల. రచయిత ఆర్​.సి. కృష్ణస్వామి రాజు రాసిన ఈ నవల ‘తానా– మంచి పుస్తకం’ పోటీలో గెలిచి, ప్రచురణకు ఎంపికైంది. 

అందమైన ఓ మారుమూల పల్లెటూరిలో మునికిష్టడు అనే బాలుడు పెంచుకుంటున్న మాణిక్యం అనే కోడి పుంజు కనిపించకుండా పోతుంది. ఆ మాణిక్యాన్ని వెతుకుతూ తన స్నేహితులతో కలసి మునికిష్టడు చేసే ప్రయాణం చుట్టూ అల్లుకున్న అందమైన కథే ఈ నవల. ఈ క్రమంలో పొద్దు పొడిచినప్పటి నుంచి పొద్దుగూకే వరకు మాణిక్యం కోసం మునికిష్టడు, అతడి మిత్రబృందం సాగించే అన్వేషణ చిన్నారులకు ఓ విలువైన విజ్ఞాన పాఠం. 

కథా గమనంలో పల్లెటూరి జీవితం, పాత్రలు చాలా సహజంగా చిత్రీకరించారు. పిల్లల మధ్య స్నేహం, వాళ్లలోని అమాయకత్వం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస, నేర్చుకోవాలనే ఆసక్తి అందంగా అక్షరీకరించారు. పిల్లలు ఒకరికొకరు సాయం చేసుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం, కలసి తినడం, ఆటలాడుకోవడం, అల్లరి చేయడం వంటివి చదువుతుంటే ఇప్పటికే బాల్యాన్ని దాటి ఇతర దశల్లో ఉన్న పాఠకులకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. గ్రామీణ జీవితంలోని బంధాలు, అనుబంధాలు, సామాజిక అసమానతలు, పెద్దల అనుభవాలు, సలహాలతో పాటు మూఢ నమ్మకాలను విభేదించే ఆధునిక విజ్జానం నవలలో కనిపిస్తాయి. 

పుస్తకంలో భాష, శైలి చాలా సులభంగా, సరళంగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు అర్థమయ్యేలా, హాయిగా, నవ్వుతూ చదువుకునేలా రచన సాగింది. పదాలు, వాక్యాలు చిన్నారులకు తెలుగు భాషపై ప్రేమ, మమకారం పెంచేలా ఉన్నాయి. పల్లెటూళ్లలో తరచూ ఉపయోగించే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు కనిపిస్తాయి. కవర్​ పేజీతోపాటు పుస్తకం లోపల సందర్భోచితంగా ఆర్​. గోపాలకృష్ణ వేసిన బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రచయిత సొంతూరు ప్రత్యేకతను కూడా ఈ పుస్తకం ద్వారా పిల్లలు తెలుసుకోగలగడం అదనం.
ఇక, మునికిష్టడి మిత్ర బృందంలోని బాలాజీపై రచయితకు ప్రత్యేక అభిమానం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ పాత్ర చిత్రణతోపాటు పేరు చివర ‘గాడు’ పదం కథ సాంతం కనిపించడం ఈ అనుమానానికి కారణం. అయితే, తొమ్మిదో తరగతి చదివే కుర్రాడికి పుంజు కోడి మాత్రమే కూస్తుందని, పెట్ట కోడి కూయదని తెలియకపోవడం విచిత్రం. ఈ ఒక్క లక్షణం ద్వారా ఆ పాత్రకు, పుస్తకానికి దిష్టి చుక్క పెట్టారు రచయిత. 

మొత్తానికి చిన్నారులకు చదువుపై ప్రేమ, తెలుగుపై మమకారం, విజ్ఞానంపై ఆసక్తి పెంచేలా ఉన్న ‘మునికిష్టడి మాణిక్యం’ నవల పిల్లలకే కాదు పెద్దలకూ నచ్చుతుంది. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలు, విద్యార్థులకు ఈ పుస్తకం బహుమతిగా అందజేసి, వారితో చదివించవచ్చు. 

– మహేశ్వర్​

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ
featureseditor@v6velugu.com

©️ VIL Media Pvt Ltd.