
ఫతేపూర్‌కు చెందిన శేష్మాన్ యాదవ్, అతని కుమారుడు ఆర్యన్ యాదవ్‌లు రోడ్డు పక్కన పెట్టుకున్న టీ స్టాల్ ఊహించని విధంగా మూసివేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. గత నెల ఫిబ్రవరిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వీరి టిస్టాల్ నుండి వెళ్తూ, వీరి దగ్గర ఒక కప్పు టీ తాగడమే ఇందుకు అసలు కారణం.
అఖిలేష్ యాదవ్ వీరి దగ్గర టి తాగి వెళ్ళిన రెండు నెలల తర్వాత, ఆహార నియమాలు ఉల్లంఘించారనే వంకతో అధికారులు వీరిని వేధించడం మొదలుపెట్టారు. ఒక బృందం వచ్చి టీ శాంపిల్స్ సేకరించి, టీ తయారు చేయడానికి అల్యూమినియం గిన్నెలు ఎందుకు వాడుతున్నారని నిలదీశారు.
టీ ఇచ్చినందుకు ఇలా
ఆర్యన్ దగ్గర ఉన్న లైసెన్స్ చూపించినప్పటికీ, అధికారులు పట్టించుకోలేదు. మీరు అఖిలేష్ యాదవ్‌కు టీ ఇచ్చారు కాబట్టి మీ దుకాణాన్ని సీజ్ చేస్తాం అని బెదిరించారని ఆర్యన్ తెలిపాడు. అధికారుల తీరును ఆర్యన్ వీడియో తీయడం మొదలుపెట్టాక, వారు మాట మార్చి అల్యూమినియం గిన్నెలు వాడటం నేరం అని చెప్పుకొచ్చారు. మేము ఏళ్ల తరబడి వీటిలోనే టీ చేస్తున్నాం, ఎప్పుడూ లేని అభ్యంతరం ఇప్పుడెందుకు ? అని శేష్మాన్ ప్రశ్నించాడు.
దాడులు, బెదిరింపులు
అధికారులు టీ తాగి, డబ్బులు అడిగినందుకు మాపై దాడి చేశారని ఆర్యన్ ఆరోపించాడు. మా తల్లిదండ్రులను కూడా కొట్టారని, మమ్మల్ని గూండాలు అని అన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిరోజు వేధింపులు, జైలుకు పంపుతామనే బెదిరింపుల భయంతో ఆ కుటుంబం దుకాణాన్ని మూసేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.
అఖిలేష్ యాదవ్ స్పందన
ఈ వార్త తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో స్పందించారు. మేము ఆర్యన్ దుకాణంలో ఎంతో ఇష్టంగా టీ తాగాము. కానీ ఆహార భద్రతా శాఖ అల్యూమినియం గిన్నెల పేరుతో అతన్ని బెదిరించింది. బీజేపీ ప్రభుత్వం ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వదు సరికదా, కష్టపడి బతికే వారిని ఇలా వేధిస్తోంది అని విమర్శించారు.
మాజీ సీఎం సహాయం
ఏప్రిల్ 18న లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్యన్‌ను పిలిపించి, అఖిలేష్ యాదవ్ అతనికి ఇత్తడి పాత్రలను బహుమతిగా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఎవరి పొట్ట కొట్టినా, మేము వారికి తోడుగా ఉంటాం అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ గతంలో చెప్పిన మురుగు కాలువ గ్యాస్‌తో టీ అనే విషయాన్ని గుర్తు చేస్తూ.. మురుగు కాలువ కలుషితమా లేక అల్యూమినియం గిన్నె కలుషితమా ? అని బీజేపీపై సెటైర్లు వేశారు.
Aryan Yadav, the young man from UP’s Fatehpur who landed in trouble after serving a cup of tea to Akhilesh Yadav. pic.twitter.com/xXxfDnNgSn
— Piyush Rai (@Benarasiyaa) April 19, 2026