
- నార్త్ ఇండియన్స్ బీజేపీని ఎత్తుకుని తిప్పుతారనే దురుద్దేశం
- మహిళా బిల్లు పేరుతో కాంగ్రెస్‍ను బద్నాం చేయాలని చూసిన్రు
- వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు
వరంగల్, వెలుగు: బీజేపీ నాలుగోసారి అధికారంలోకి రావడానికే మోసపూరితంగా డీలిమిటేషన్ బిల్లు ముందుకు తెచ్చిందని.. చివరి నిమిషంలో దీనిని గ్రహించిన ఇండియా కూటమి వారి కుట్రను తిప్పికొట్టిందని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. ఆదివారం హనుమకొండలోని డీసీసీ భవన్‍లో జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన ప్రెస్‍మీట్ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి మాట్లాడారు.
నార్త్ ఇండియన్స్ ఎలాగూ ఒక మతాన్ని నమ్మి బీజేపీని ఎత్తుకుని తిప్పుతారనే దురుద్దేశంతో.. కేంద్రం పెద్దలు దక్షిణాది సీట్లపై కుట్ర చేశారన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా తగ్గిందని.. నార్త్ ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ పాటించకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగి ఇప్పుడు వారికి కలిసి వస్తోందన్నారు. అందువల్లే కేవలం జనాభా ప్రాతిపాదికన కాకుండా సీఎం రేవంత్‍రెడ్డి సూచించిన జీడీపీ ఆధారంగా సీట్ల పెంపు ప్రక్రియ జరపాలన్నారు. మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, ప్రస్తుతం ప్రవేశపెట్టింది రాజ్యాంగానికి తూట్లు పొడిచే బిల్లు మాత్రమేనని విమర్శించారు.
హడావుడిగా మూడు బిల్లులు ప్రవేశపెట్టి మహిళా బిల్లు పేరుతో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చూశారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆ ప్రాంత నేతలు బీజేపీకి లొంగిపోయారన్నారు. దక్షిణాది ప్రాంతం నష్టపోతుందని తెలిసినా స్పందించలేదన్నారు. కేంద్రం సైతం రాష్ట్ర విభజన చట్టాలు అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేసి ఏపీకి మాత్రమే అత్యధిక నిధులు, ప్రాజెక్టులు ఇస్తోందని విమర్శించారు. పార్లమెంట్లో ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రాంతంపై అనుచితంగా మాట్లాడితే తెలంగాణ బిడ్డగా మంత్రి కిషన్‍రెడ్డి ఖండించలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ కావాలనే దక్షిణాదిపై నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గించేందుకు మోదీ, అమిత్ షా కుట్ర చేశారన్నారు.