
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు మింగి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ అప్పటి సీఎం కేసీఆర్ ఇంజినీర్లు చెప్పినా వినకుండా సొంత నిర్ణయాలతో ప్రాజెక్టు డిజైన్లు చేశారని, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మేడిగడ్డను సందర్శించి, ప్రభుత్వంపై నిందలు మోపడం సిగ్గు చేటన్నారు.
రూ.35వేల కోట్ల అంచనాలతో ప్రారంభించిన పనులను డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి దోచుకున్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనతో తమ బండారం బయటపడ్తదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం బహిరంగ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భట్టు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.