
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో నగర వాసులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. పట్టణ వాసుల దాహార్తి తీర్చేందుకు సుమారు రూ.124 కోట్లతో అమృత్ స్కీం పనులు చేపట్టినా, నత్తతో పోటీ పడ్తున్నాయి. నీటి వనరులు పుష్కలంగా ఉన్నా కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రతిరోజు తాగు నీటిని సప్లై చేయలేకపోతున్నారు. రోజు విడిచి రోజు కూడా సక్రమంగా వాటర్ సప్లై కావడం లేదని ప్రజలు మండిపడ్తున్నారు. తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
నీటి వనరులున్నా సప్లై లేదు..
సమీపంలోనే కిన్నెరసాని ప్రాజెక్టుతో పాటు సింగరేణి, మిషన్ భగీరథ వంటి నీటి సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు విఫలమవుతున్నారు. కిన్నెరసాని నీటి స్కీం కింద ఇప్పటికే రూ.కోట్లు ఖర్చు పెట్టారు. కొత్తగూడెం నగర వాసుల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండున్నరేండ్ల కిందట ప్రారంభించిన అమృత్ 2.0 స్కీం పనులు మార్చిలోపే పూర్తి కావాల్సి ఉంది. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు ఉన్న పాల్వంచలోని పలు బస్తీలు, కొత్తగూడెం, రామవరంలో ప్రజలు నిత్యం తాగునీటి కోసం అవస్థలు పడ్తున్నారు.
వాటర్ సప్లైలో దాదాపు 25 శాతం లీకేజీల ద్వారా నీళ్లు వృథాగా పోతున్నాయి. నీటి ఇబ్బందులపై కార్పొరేషన్ ఆఫీస్‌లో చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. అమృత్2.0 స్కీం పనులు త్వరగా చేపట్టి నీటి ఎద్దడికి చెక్‌పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై కొత్తగూడెం డీఈ శ్రీనివాస్‌ను సంప్రదించగా సమ్మర్ప్లాన్ రెడీ చేస్తున్నామని చెప్పారు. నగరంలోని భజనమందిరం ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ పగలడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. రిపేర్లు చేపట్టామన్నారు.