Reading Time: < 1 minute

ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారు  : మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు

Caption of Image.
  • బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్​రావు

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రమంతా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం మమత మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అధ్యక్షతన జరిగిన పార్టీ సన్నాహక సమావేశం, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి, 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను రోడ్డున పడేసిందని ఆరోపించారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఇలాకాలో రైతులు పండించిన మక్కలు కొనే దిక్కులేకపోతే, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటా రూ.1,700 లకు అమ్ముకుని నష్టపోతున్నారని విమర్శించారు.

ఇక్కడే వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి ఉన్నప్పటికీ జిల్లాకు ఓరిగిందేమీ లేదని ఎద్దేవాచేశారు. రైతు బంధు స్కీం పేరుతో రూ.20 వేల కోట్లు మోసం జరిగిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెంలో కానీ, సిద్దిపేట లో కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమని హరీశ్​రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తలేదని మండిపడ్డారు. వెలుగు మట్ల భూదాన్ భూమిలో ఇండ్లు నిర్మించుకున్న 8 వందల నిరుపేదల ఇండ్లు కూల్చి, 3 వందల మంది కి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని, మిగిలిన వారికి కూడా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో 10కి 10 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే శాసన సభ్యులను అసెంబ్లీ గేటు తకనివ్వమని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.