
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపాలిటీ డబిల్‌పూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
డబిల్‌పూర్ గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసేందుకు ఇద్దరు విద్యార్థులు వెళ్లారు. అయితే నీటి లోతును గమనించని చిన్నారులు లోపలికి వెళ్లడంతో నీట మునిగిపోయారు. మృతుల్లో మునీరాబాద్ నాగార్జున హై స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఉమన్(14) ఒకరు కాగా.. డబిల్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఎస్.కే. ఇర్ఫాన్(12) మరొకరు.
గమనించిన స్థానికులు వెంటనే వారిని నీటి నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న పిల్లలు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెలవు రోజుల్లో చిన్నారులు చెరువులు, కుంటల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.