
జోగిపేట, పుల్కల్, వెలుగు: విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. శివంపేట పాలిటెక్నిక్ కాలేజీలో రూ. 43 లక్షలతో నిర్మించిన మెకానికల్ వర్క్ షాప్ షెడ్‌ను కలెక్టర్ పి. ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే పాలిటెక్నిక్, జేఎన్టీయూ ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, వ్యవసాయ, మహిళా కాలేజీలతోపాటు మోడల్, రెసిడెన్షియల్, కేజీబీవీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సీఎస్ఆర్ నిధులు రూ. 10 కోట్ల తో నియోజకవర్గంలోని విద్యాసంస్థలలో మౌలిక వసతులు చేపడుతున్నట్లు వివరించారు. మంత్రి తన పర్యటనలో భాగంగా రూ. 27.76 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందోల్‌లో రూ. 1.80 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించగా, చెరువు కట్ట వద్ద రూ. 5 కోట్లతో నిర్మించనున్న పర్యాటక రెస్టారెంట్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ పాండు, ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్, న్యూలాండ్ ఫౌండేషన్ ప్రతినిధి డీవీ రెడ్డి, సర్పంచ్ సంధ్యారాణి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.