
- గరిష్టంగా 2 లక్షల మందికి ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉండాలి: సీఎం రేవంత్
- కొన్ని రాజ్యాంగ సవరణలకు 2/3 మెజార్టీ సరిపోదు
- దేశానికి నేనే రాజు అని మోదీ సవరణ బిల్లు తెస్తే చెల్లదు
- ఇలాంటి నేతలు పుడతారనే ఆనాడే రాజ్యాంగాన్ని అంబేద్కర్ బలంగా రూపొందించారు
- బీజేపీతో కలిసేవాళ్లను ఆ పార్టీనే మింగేస్తుందని కామెంట్
- ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుతం దేశంలో లోక్ సభ, రాజ్యసభ స్థానాల పెంపు వల్ల ఎలాంటి లాభం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ సీట్ల కన్నా అసెంబ్లీ సీట్ల పెంపు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలు కేవలం పాలసీలు రూపొందించేందుకే ఉన్నాయని, ప్రజలకు అడ్రస్ చేసేందుకు కాదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
పార్లమెంట్ పని కేవలం దేశంలో చట్టాలను రూపొందించడమేనని చెప్పారు. విదేశాంగ విధానాలు, ద్రవ్యోల్బణం, రైల్వే, టెలికాం, ఎయిర్‌వేస్‌లాంటి ఇతర శాఖల పాలసీలో ఏం నిర్ణయించాలనేది కేంద్రం చూస్తుందని తెలిపారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయని అన్నారు. అలాగే, రాష్ట్రాల్లో పని చేసేందుకు స్థానిక ప్రభుత్వాలు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీలు ఉన్నాయని తెలిపారు.
ఆ పని కూడా ప్రధాని మోదీయే చేయలనుకోవడం సరికాదన్నారు. కొన్ని రాజ్యాంగ సవరణలకు 2/3 వంతు సభ్యుల బలం కూడా సరిపోదని, బలం ఉంది కదా అని రేపు దేశానికి తానే రాజు అని మోదీ సవరణ బిల్లు తెస్తే చెల్లదని పేర్కొన్నారు. ఇలాంటి నేతలు పుడతారనే.. ఆనాడే అంబేద్కర్, ఇతరులు రాజ్యాంగాన్ని ఎంతో బలంగా రూపొందించారని గుర్తు చేశారు. వేటికి సవరణ చేయాలి.. వేటికి చేయవద్దనేది రాజ్యాంగంలో చాలా బలంగా ఉందన్నారు. అధికారం ఉందికదా అని రాజ్యాంగ పునాదులనే కదిలిస్తామని అనుకుంటే.. పూర్తిగా కుప్పకూలుతారని పరోక్షంగా మోదీని హెచ్చరించారు.
కలెక్టర్ పనికూడా మోదీనే చేయాలనుకుంటున్నరు
దాదాపు 2 లక్షల మంది ప్రజలకు ఒక అసెంబ్లీ నియోజక వర్గం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇందుకోసం 2026 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం యూపీలో ఒక లోక్ సభ నియోజకవర్గంలో 5–7, తెలంగాణలో దాదాపు 7, గోవాలో 20, ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అసెంబ్లీ సీట్లు ఉన్నాయన్నారు. ‘‘లోక్‌సభ, రాజ్యసభలు చట్టాలు చేసేందుకు ఉన్నాయి. ఆ చట్టాలను నిర్వహించేందుకు అసెంబ్లీ, ఎమ్మెల్యేలు, గ్రామ పంచాయితీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు ఇంప్లిమెంట్ ఏజెన్సీలు. అలాగే.. డిస్ట్రిక్ మెజిస్ట్రేట్(డీఎం), చీఫ్ మినిస్టర్(సీఎం), ప్రైం మినిస్టర్(పీఎం)ల పనితీరు కూడా వేరు.
ఇప్పుడు ప్రధాని మోదీ.. జిల్లా కలెక్టర్(డీఎం) పని కూడా చేయాలనుకుంటున్నారు” అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలే ప్రజలతో మమేకం అవుతారని చెప్పారు. వారి సమస్యలను ఎమ్మెల్యేలు తెలుసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి, సమస్యను పరిష్కరిస్తారన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై ఇద్దరు నేతలు(మోదీ, షాలు) మూసిన గదిలో కూర్చొని సవరణలు చేస్తానంటే నడవదని తెలిపారు. దాదాపు 200 రోజులు నడిచే పార్లమెంట్ సమావేశాలను చివరకు బీజేపీ 50 రోజులకు తెచ్చిందని మండిపడ్డారు.
బీజేపీతో కలిస్తే అంతే..
బీజేపీతో కలిసే వాళ్లకు ఎప్పుడో ఒకప్పుడు ఆ పార్టీయే నష్టం చేస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘వాళ్లు వీక్‌గా ఉన్నప్పుడు సహకారం తీసుకుంటారు. అదే మనం బలహీనపడ్డప్పుడు మింగేస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్.. తాజాగా బిహార్ సీఎంగా రాజీనామా చేసిన నితీశ్ కుమార్‌లే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కోవలో ఇంకా మరింత మంది దొరుకుతారని పలువురు సీఎంలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.