
హైదరాబాద్, వెలుగు: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరుపై సీఎస్ కె. రామకృష్ణా రావు శనివారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెల్ఫేర్ వీక్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ రోజువారీ షెడ్యూల్‌ను వివరించారు.
ఏప్రిల్ 20న అన్ని వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటశాలలు, సానిటేషన్ పై శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 21న విద్యార్థులకు క్విజ్, డిబెట్, చిత్రలేఖనం వంటి పోటీలు 22న హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో మరమ్మతులు పూర్తి, 23న తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు, 24న యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, 25న విద్యార్థులకు క్రీడలు, సమ్మర్ క్యాంపులు, 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో బడి బాట నిర్వహించాలని సూచించారు.