Reading Time: 2 minutes

తాగునీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్ : ఎండీ అశోక్రెడ్డి

Caption of Image.
  • వెస్ట్​ సిటీలో తగ్గిన భూగర్భజలాలు
  • నీళ్లను పొదుపుగా వాడాలి
  • వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్ సిటీకి రాబోయే 45 రోజులు తాగునీటి సరఫరా పరంగా కీలకమని మెట్రో వాటర్‌‌‌‌‌‌‌‌బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు మే నెలాఖరు వరకు నీటి వినియోగంలో పొదుపు పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాటర్‌‌‌‌‌‌‌‌బోర్డు పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో ప్రస్తుతం సుమారు 2 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి నీటి సరఫరా చేస్తున్నామన్నారు.

గోదావరి, కృష్ణా, సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి అవసరమైన 580 ఎంజీడీల నీటిని పూర్తి స్థాయిలో అందించడం ప్రస్తుతం సాధ్యం కాకపోయినా, సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం బోర్డు పరిధిలో 15 లక్షల కనెక్షన్లకు తాగునీటిని అందిస్తున్నామని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ట్యాంకర్ల బుకింగ్‌‌‌‌‌‌‌‌లు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

నీరు వృథా చేస్తే జరిమానా..

స్నానాలకు షవర్‌‌‌‌‌‌‌‌లు వాడకూడదని, మొక్కలకు నీరు పోయడం, వాహనాలు కడగడం, ఫ్లోర్ క్లీనింగ్ వంటి పనులకు తాగునీటిని వినియోగించవద్దని అశోక్​రెడ్డి సూచించారు. సంపుల ఓవర్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు, ఇంటి నల్లాల నుంచి నీరు వృథా కావడంపై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నీటిని వృథా చేసే వారిపై భారీ జరిమానాలు విధిస్తామని, పునరావృతమైతే నల్లా కనెక్షన్ కూడా తొలగిస్తామని హెచ్చరించారు. నగరానికి అదనపు నీటి సరఫరా కోసం గోదావరి ఫేజ్–2 పనులు ప్రారంభించామని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అశోక్ సామ్రాట్, పంకజ, సంతోష్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సుదర్శన్  పాల్గొన్నారు.

ట్యాంకర్లకు భారీ డిమాండ్..

మాదాపూర్, కొండాపూర్, మణికొండ, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ నగర్, శేరిలింగంపల్లి వంటి వెస్ట్ సిటీ ప్రాంతాల్లో ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఉందని అశోక్ రెడ్డి తెలిపారు. మొత్తం కనెక్షన్లలో ఈ ప్రాంతాలు సుమారు 20 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, సరఫరా చేస్తున్న ట్యాంకర్లలో 80 శాతం అక్కడికే వెళ్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 105 రోజుల్లో 6,19,743 ట్యాంకర్లను సరఫరా చేసినట్లు వెల్లడించారు. భూగర్భ జలాలు ఎండిపోవడంతో అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు, విల్లాలు, హాస్టళ్లు, హోటళ్లు, మెస్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయని చెప్పారు. వెస్ట్ సిటీలో సుమారు 48 వేల మంది వినియోగదారులు ట్యాంకర్లను బుక్ చేస్తున్నట్లు సర్వేలో తేలిందన్నారు. ప్రస్తుతం నగరంలో 1150 ట్యాంకర్లు, 650 ఫిల్లింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని వివరించారు.

©️ VIL Media Pvt Ltd.