
న్యూఢిల్లీ: లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శనివారం (ఏప్రిల్ 18) జాతినుద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయని.. మహిళల స్వప్నాన్ని చిదిమేశారని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.
ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం పక్షపాత ధోరణితో ఉందని, మహిళల సమస్యలపై దృష్టి సారించలేదని కాంగ్రెస్ ఎదురు దాడి చేసింది. ప్రధాని మోడీ ఒక ప్రభుత్వ అధినేతగా కాకుండా ప్రచారకర్తలా మాట్లాడారని విమర్శించింది. ప్రధాని మోడీ ఆయన ప్రసంగంలో కాంగ్రెస్తో పాటుతో ప్రతిపక్ష పార్టీల పేర్లు పదే పదే ప్రస్తావిస్తూ దాడి చేశారు కానీ మహిళల గురించి పెద్దగా మాట్లాడలేదని పేర్కొంది.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్లో 2023లో ఆమోదించబడిందని.. ప్రధాని మోడీకి మహిళా రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2023 మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ చట్టం అమలు చేస్తే బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించింది. డ్రామాలు ఆడటం, చెప్పిందే పదే పదే చెప్పడం కాకుండా ప్రజలు నిజమైన సమాధానాలు కోరుకుంటున్నారని పేర్కొంది.
ప్రధాని మోడీ ఏమన్నారంటే..?
మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి.. మహిళల స్వప్నాన్ని చిదిమేశారు.. అందుకు దేశంలోని మహిళలందరికి నేను క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని మోడీ అన్నారు. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 18) ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
“మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసింది. మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైంది. నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నారు. మహిళల కలలను ప్రతిపక్షాలు ధ్వంసం చేశారు. మహిళా బిల్లును ఓడగొట్టి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్లు అడ్డుకొని విపక్షాలు పాపం చేశాయి.
అడ్డుకోవడం మహిళల ఆత్మాభిమానంపై జరిగిన దాడి. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మరిచిపోరు. రిజర్వేషన్లను అడ్డుకున్న వారిని మహిళలు తప్పకుండా శిక్షిస్తారు. ఇది భ్రూణహత్యలతో సమానం. ఈ భ్రూణ హత్యలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీలు పాలుపంచుకున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ కుటుంబ పార్టీలు.
వాళ్లు మహిళలను ఎదగనీయరు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఎంతో నిజాయితీతో తెచ్చిన బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మహిళా కోటా బిల్లును వ్యతిరేకించడంలో ప్రతిపక్షం చేసిన పాపానికి శిక్ష తప్పదు” అని ప్రధాని మోడీ హెచ్చరించారు.