
న్యూఢిల్లీ: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అమెరికా తీరుకు నిరసనగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ క్లోజ్ చేసింది. ఈ క్రమంలో హార్మూజ్ మీదుగా భారత జెండాలతో ప్రయాణిస్తోన్న రెండు నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) కాల్పులు జరిపారు. హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత్లోని ఇరాన్ రాయబారికి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.
ఈ ఘటనపై అధికారికంగా నిరసన తెలియజేయడంతో పాటు ఇరాన్ దళాలు ఏ పరిస్థితులలో కాల్పులు జరిపాయనే దానిపై ఇరాన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం స్పష్టత కోరనుంది. అయితే, నౌకల్లో ఉన్న సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, నౌకకు నష్టం జరగలేదని తెలుస్తోంది. భారతీయ నావికులు, నౌకల భద్రతను నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. మిత్ర దేశమైన భారత నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించే అవకాశం ఉంది.
ఇరాన్ ఒప్పుకున్నా.. మేం ఒప్పుకోం: ట్రంప్
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హార్మూజ్ జలసంధిలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. అయితే.. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంట్లలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
ఇరాన్ తెరిచినా ఒప్పందం ప్రకారం మా లావాదేవీలు పూర్తయ్యాకే హార్ముజ్ జలసంధి ద్వారా పూర్తి స్థాయిలో నౌకల రాకపోకలు జరుగుతాయని చెప్పారు. హార్ముజ్ జలసంధి రాకపోకలకు తెరిచి ఉందని ఇరాన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“హార్ముజ్ జలసంధి ప్రస్తుతం పూర్తిగా తెరిచి ఉంది.. వాణిజ్య కార్యకలాపాలు, నౌకల పూర్తి రాకపోకలకు సిద్ధంగా ఉంది. అయితే, ఇరాన్తో మా లావాదేవీలు 100% పూర్తయ్యేంత వరకు కేవలం ఇరాన్కు సంబంధించి మాత్రమే నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో కొనసాగుతుంది. ఇరాన్ తో ఈవిషయంపై చాలా అంశాల్లో చర్చలు విజయవంతమయ్యాయి.
ఈ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుందని ఆశిస్తున్నాను” అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనపై భగ్గుమన్న ఇరాన్ హార్మూజ్ జలసంధిని తిరిగి మళ్లీ మూసివేసింది. ఈ నేపథ్యంలోనే హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న ఇండియన్ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి.