Reading Time: < 1 minute

సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు: విజయ్‎పై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు

Caption of Image.

చెన్నై:  ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్‎పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. పళనిలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎన్. పాండి ప్రచార కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ నటులు తెరపై రకరకాల పాత్రలను పోషించగలిగినప్పటికీ.. నిజ జీవిత రాజకీయాలు మాత్రం వేరని అన్నారు. 

‘‘సినిమాలో మీరు డాక్టర్‌గానో, ఇంజనీర్‌గానో, లేదా ముఖ్యమంత్రిగానో నటించవచ్చు. కానీ, రాజకీయాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి ఎలా కాగలరు..? రాష్ట్ర ప్రజలు, తమిళనాడు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వారి పక్షాన నిలబడ్డారా..? లేదా భాష కోసం, దాని ఆత్మగౌరవం కోసం పోరాడారా..? ప్రజలకు మీపై ఉన్న ప్రేమ మీ నటనకు మాత్రమే. అది మీ రాజకీయాలకు కాదు. అదే ప్రేమను మీరు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు’’ అని విమర్శించారు. 

ఒక నటుడిగా ప్రత్యక్షంగా అభిమానులను కలవకపోయినప్పటికీ.. రాజకీయాల్లో మాత్రం క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో మమేకం అవ్వడం ముఖ్యమని సూచించారు. రాజకీయాల్లో నామ్ కే వాస్త్‎గా కాకుండా నటుడు-రాజకీయవేత్త సీమాన్‌ మాదిరిగా నిరంతరంగా చురుగ్గా ఉండాలని హితవు పలికారు. ‘‘తనకు ఒక నటుడు నచ్చితే అతడి కోసం గొంతు బొంగురుపోయేంత వరకు ఈలలు వేస్తా. కానీ వారికి దేశాన్ని ఇవ్వలేను. రాజకీయాలు వేరు సినిమా వేరు. నటుడిపై అభిమానం వేరు.. రాజకీయాల్లో బాధ్యత వేరు. ఒక పొలిటిషియన్ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యల కోసం పోరాడాలి, మాట్లాడాలి’’ అన్నారు. 

డీఎంకే ద్రవిడ నమూనా, అన్నాడీఎంకే బానిస నమూనా, విజయ్ సినిమా నమూనా.. ఈ మూడింటిలో ఎలాంటి పాలనను ఇష్టపడతారని ప్రకాష్ రాజ్ ఓటర్లను ప్రశ్నించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ దూసుకుపోతున్న వేళ సహా నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి 2026, ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 2026, మే 4న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. 

 

©️ VIL Media Pvt Ltd.