
నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. ప్లాట్లు, ఫ్లాట్లు కమీషన్ మీద అమ్మి పెడుతుంటాను. అయితే నా దగ్గరకు వచ్చే చాలా మంది ‘మాకు తూర్పు ముఖం ఉన్న ప్లాటే కావాలి’ అంటున్నారు. కొందరైతే దక్షిణం దిక్కు అంటేనే… ‘వద్దు.. వద్దు’ అంటున్నారు. అసలు దిక్కుల్లో మంచివి, చెడ్డవి అని ఉంటాయా? వాస్తు ప్రకారం ఏ దిక్కుల్లో ఉన్న ప్లాట్లు మంచివి? వీటికి సంబంధించి ఇంకేం నిబంధనలుఉంటాయి?
— షేక్ అబ్దుల్లా, హైదరాబాద్
సాధారణంగా అన్నిదిక్కులూ మంచివే. కాకపోతే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కో దిక్కు కలిసి వస్తుంది. మరికొందరికి కొన్ని దిక్కులు కలిసిరాక దివాలా తీస్తారు. ఇలాంటి నిబంధనలు వాస్తులో ఉంటాయి. కాకపోతే అందరికీ తూర్పు ముఖమే మంచిదని ఎక్కడా లేదు. దక్షిణం దిక్కు కూడా చాలామందికి కలిసి వస్తుంది. దానివల్లే బాగుపడే వాళ్లు ఉంటారు. దిక్కుల్లో మంచివి, చెడ్డవి అని ఉండవు. అలా అనుకోవడం చాలా తప్పు. కాకపోతే అవగాహన లోపం వల్ల తూర్పు ఒక్కటే మంచిది. అనుకుంటున్నారు.
ఎలక్ట్రిక్ సామాన్లు ఎక్కడుండాలి?
కొన్నేళ్ల క్రితం మా పాత ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించలేదు. దాని దుష్ప్రభావం వల్లో, మరి ఏ ఇతర కారణాల వల్లో అప్పుల్లో కూరుకుపోయాం. చివరికి నాలుగేళ్ల క్రితం ఆ ఇంటిని అమ్మేశాం. అప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడుమా అబ్బాయి మంచి ఉద్యోగంలో చేరాడు. లోన్ పెట్టి ఈమధ్యే మా పాత ఇల్లు దగ్గర్లోనే, వాస్తు ప్రకారం నిర్మించిన ఇల్లు కొన్నాం. ఇంట్లో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలు వాస్తు ప్రకారం ఎక్కడ ఉంటే మంచిదో చెప్పండి.
-సోమనర్సింహ, వరంగల్
వాస్తు దోషాలు ఎక్కువగా ఉండి, వాటిని నివృత్తి చేయకపోతే కచ్చితంగా ఆ ఇల్లు అమ్మి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. మీ పాత ఇల్లు కూడా ఆ కారణం వల్లే అమ్ముడుపోయినట్టుంది. కొత్త ఇల్లు వాస్తు ప్రకారం ఉందన్నారు. దానికి చాలా సంతోషం. రిఫ్రిజిరేటర్, ఎలక్ట్రిక్ రైస్ కుకర్, ఒవెన్, వాషింగ్ మెషీన్ వంటి విద్యుత్ గృహోపకరణాలను తూర్పు ఆగ్నేయం, పడమర వాయువ్యంలో పెట్టుకుంటే ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. ఇవి మాత్రమే కాదు… జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి కూడా అక్కడ ఉంటేనే ప్రమాదాలకు తావు ఉండదు.
వాస్తు సిరి
కాశీనాథుని శ్రీనివాస్,
వాస్తు కన్సల్టెంట్
9440088799