Reading Time: 2 minutes

ఐమాక్స్‌కు పోటీగా ‘ఇన్ఫినిటీ విజన్’.. సొంత థియేటర్ల సామ్రాజ్యం ఏర్పాటుకు డిస్నీ మాస్టర్ ప్లాన్!

Caption of Image.

సినిమా అంటే కేవలం కథ మాత్రమే కాదు, అదొక అనుభూతి. ఆ అనుభూతిని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడంలో IMAX, Dolby Cinema వంటి ప్రీమియం ఫార్మాట్లు థియేటర్లలో ఇప్పటికే రారాజులుగా వెలుగొందాయి. అయితే, ఇప్పుడు హాలీవుడ్ దిగ్గజం ‘డిస్నీ’ ఈ రంగంలోకి నేరుగా అడుగుపెట్టింది. సినిమాకాన్ 2026 (CinemaCon 2026) వేదికగా డిస్నీ తన సరికొత్త ప్రీమియం థియేట్రికల్ సర్టిఫికేషన్ ‘ఇన్ఫినిటీ విజన్’ (Infinity Vision) ను ప్రకటించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

అసలేమిటీ ఇన్ఫినిటీ విజన్?

ఇది కేవలం ఒక కొత్త ప్రొజెక్టర్ సాంకేతికత మాత్రమే కాదు, ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నది. అంటే, ఏదైనా థియేటర్ ‘ఇన్ఫినిటీ విజన్’ బ్యాడ్జ్ పొందాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణ స్క్రీన్ల కంటే ఎత్తుగా, ప్రేక్షకుల కంటికి నిండుగా కనిపించేలా భారీ స్క్రీన్ ఉండాలి.  మార్వెల్, స్టార్ వార్స్ సినిమాల్లోని అద్భుతమైన రంగులు, విజువల్స్ స్పష్టంగా కనిపించేలా హై-కాంట్రాస్ట్ లేజర్ సిస్టమ్స్ తప్పనిసరి.  డాల్బీ అట్మోస్‌కు ధీటుగా, గది నలుమూలల నుండి ధ్వని వినిపించే అధునాతన సౌండ్ సిస్టమ్ ఉండాలి.

డిస్నీ మాస్టర్ ప్లాన్ ఇదే..

డిస్నీ ఈ అడుగు వేయడానికి ప్రధాన కారణం 2026 డిసెంబర్ విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలే.. డెనిస్ విల్లెనూవ్ తెరకెక్కిస్తున్న ‘డ్యూన్: పార్ట్ 3’ (Dune: Part Three) ఇప్పటికే ఐమాక్స్ స్క్రీన్లను మూడు వారాల పాటు రిజర్వ్ చేసుకుంది. అదే సమయంలో డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ (Avengers: Doomsday) విడుదల కానుంది. ఐమాక్స్ స్క్రీన్లు దొరక్కపోతే వెనక్కి తగ్గడం డిస్నీకి ఇష్టం లేదు. అందుకే, ఐమాక్స్ కాని ఇతర భారీ స్క్రీన్లను తన ఆధీనంలోకి తెచ్చుకుని, వాటికి ‘ఇన్ఫినిటీ విజన్’ బ్రాండింగ్ ఇచ్చి తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చూస్తుంది.

ALSO READ : అబద్ధాలు వద్దు పవన్..

‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’తో గ్రాండ్ ఎంట్రీ

ఈ కొత్త ఫార్మాట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి డిస్నీ ఒక అద్భుతమైన ఎత్తుగడ వేసింది. 2026 సెప్టెంబర్ 25న ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను సరికొత్త ‘ఇన్ఫినిటీ విజన్’ వెర్షన్‌లో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని అదనపు ఫుటేజ్ ఉంటుందని రూసో బ్రదర్స్ వెల్లడించారు.  ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ తో డిస్నీ తన పంపిణీ వ్యవస్థపై పట్టు పెంచుకోవడమే కాకుండా, థియేటర్ అనుభవాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తుంది. అయితే ‘ఇన్ఫినిటీ విజన్’ ఐమాక్స్ అంతటి క్రేజ్‌ను సంపాదిస్తుందా? లేదా కేవలం ఒక బ్రాండ్ లోగోగా మిగిలిపోతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.

 

©️ VIL Media Pvt Ltd.