
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరటనిస్తూ శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోడీ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 2 శాతం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత అక్టోబర్‌లో డీఏను 55 శాతం నుండి 58 శాతానికి పెంచగా.. తాజా నిర్ణయంతో ఇది 60 శాతానికి చేరుకోనుంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ఈ సర్దుబాట్లు చేస్తుంది.
ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం ఏర్పాటుపై తమ డిమాండ్లను ఉధృతం చేస్తున్న తరుణంలో ఈ డీఏ పెంపు నిర్ణయం వచ్చింది. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ప్రభుత్వం ముందు ఒక మెమోరాండం ఉంచింది. ఇందులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83కి పెంచాలని, దీంతో బేసిక్ వేతనాన్ని రూ.18వేల నుండి దాదాపు రూ.69వేలకు పెంచాలని కోరింది. అలాగే పే లెక్కల కోసం ఫ్యామిలీ నిర్వచనంలో ఆధారపడిన తల్లిదండ్రులను చేర్చాలని, వేతన అసమానతలను తగ్గించాలని కూడా ప్రతిపాదించింది.
కేబినెట్ కేవలం ఉద్యోగులకే కాకుండా మెరైన్ వాణిజ్య రంగానికి కూడా భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. రూ.13వేల కోట్ల కార్పస్‌తో ‘సావరిన్ మారిటైమ్ ఫండ్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిధి ద్వారా భారత జెండా కలిగిన ఓడలకు, భారత్ వైపు ప్రయాణించే.. భారత మూలాలున్న నౌకలకు తక్కువ ధరకే ఇన్సూరెన్స్ కవరేజీని కల్పించనున్నారు. దేశీయ నౌకాయాన రంగం ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కొనేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ : KPHBలో అమ్మాయిలను వేధిస్తున్న సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి..
మరోవైపు గ్రామీణ మౌలిక సదుపాయాల పటిష్టత కోసం ‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’ పథకాన్ని 2028 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అదనంగా రూ.3వేల కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిర్ణయంతో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.