Reading Time: 2 minutes

మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు NDA ప్రభుత్వం కుట్ర: సీఎం రేవంత్

Caption of Image.

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన వేదికగా నిప్పులు చెరిగారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసిందని విమర్శించారు. NDA సర్కార్ నిజాయితీగా మహిళా బిల్లును తేలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. 

మహిళా బిల్లు మాటున డీలిమిటేషన్ బిల్లు తెచ్చారని కేంద్రం తీరును దుయ్యబట్టారు. మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థంగా అడ్డుకుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఇది రాజకీయ విధానాలకు ఓటమి కాదని, బీజేపీ విధానాలకు ఓటమి అని సీఎం రేవంత్ అభివర్ణించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ గతంలో కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. 

దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నామని, విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిందని ఆయన చెప్పారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు NDA ప్రభుత్వం కుట్ర పన్నిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చిన్న సవరణలతో మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని సీఎం సూచించారు. రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరిగిందని, బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే కచ్చితంగా రాజ్యాంగాన్ని కూడా మార్చేవారని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి, డీలిమిటేషన్ చేపట్టి లోక్‌సభ సీట్లను పెంచడానికి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. శుక్రవారం లోక్​సభలో జరిగిన డివిజన్​  ఓటింగ్​లో బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్​లో పాల్గొనగా, బిల్లు ఆమోదం పొందడానికి సభకు హాజరైనవారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ.. 352 ఓట్లు అవసరమయ్యాయి. 

దీంతో మెజారిటీకి 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు వీగిపోయిందని లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ (131వ రాజ్యాంగ సవరణ) బిల్లును డీలిమిటేషన్ బిల్లుకు ముడిపెడుతూ ప్రవేశపెట్టడంపైనే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. మహిళా కోటా చట్టం సవరణ బిల్లును వేరుగా పెడితే మద్దతు ఇస్తామని తేల్చిచెప్పాయి. కానీ బిల్లును వేరుగా పెట్టేందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. దీంతో ఆమోదానికి సరిపడా ఓట్లు రాక బిల్లు వీగిపోయింది.

©️ VIL Media Pvt Ltd.