
హైదరాబాద్ లోని ఆల్వాల్ లో దారుణం జరిగింది. బస్సు ఆపమన్న చోట ఆపకపోవడంతో కండక్టర్ ను చితకబాదాడు ఓ తాగుబోతు. శనివారం ( ఏప్రిల్ 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సులో జరిగింది ఈ ఘటన. సికింద్రాబాద్ నుంచి టెలికాం కాలనీకి వెళ్లాల్సిన 23 T బస్సులో ఎక్కిన ఓ తాగుబోతు తాను ఆపమన్న చోట బస్సు ఆపలేదని కండక్టర్ తో గొడవకు దిగాడు.
ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరడంతో తన చేతికున్న కడియంతో కండక్టర్ ను ఘోరంగా గాయపరిచాడు తాగుబోతు. ఈ క్రమంలో కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో బస్సులోని ఇతర ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తాగుబోతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.