Reading Time: < 1 minute

రాసలీలల వీడియోల జ్యోతిష్యుడి బిజినెస్ పార్టనర్, అతని భార్య కారు యాక్సిడెంట్లో మృతి

Caption of Image.

నాసిక్: రాసలీలల వీడియోలతో దొరికిపోయి జైలులో ఊచలు లెక్కబెడుతున్న వివాదాస్పద జ్యోతిష్యుడు, నాసిక్ నకిలీ బాబా అశోక్ ఖరాత్కు అత్యంత ఆప్తుడు జితేంద్ర షెల్కే (50) యాక్సిడెంట్లో చనిపోయాడు. జితేంద్ర షెల్కే భార్య అనురాధ (45) కూడా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. జితేంద్ర 14 ఏళ్ల కొడుకు షిరిడీలోని హాస్పిటల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ పిల్లాడిని కాపాడటానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ అయిన నాసిక్‌ నకిలీ బాబా అశోక్ ఖరాత్‌కు జితేంద్ర షెల్కే అత్యంత సన్నిహితుడు. ఖరత్‌కు షెల్కే వ్యాపార భాగస్వామి. అశోక్ ఖరాత్కు చెందిన శివనికా ట్రస్ట్‌కు షెల్కే ఉపాధ్యక్షుడు కూడా కావడం గమనార్హం. పశ్చిమ మహారాష్ట్ర జిల్లాలోని కోపర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ధోత్రే గ్రామం దగ్గరలో.. ముంబైకి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.

షెల్కే కారు నడుపుతున్నాడు. కారులో అతనితో పాటు అతని భార్య, కొడుకు ఉన్నారు. ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ఛత్రపతి సంభాజీనగర్ నుంచి థానేకు వస్తున్నారు. ధోత్రే గ్రామం దగ్గరలోకి వీళ్ల కారు రాగానే.. కారు అతి వేగం కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. షెల్కే, అతని భార్య అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వీళ్ల కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కోపర్గావ్ పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంట్ కేసు నమోదైంది.

©️ VIL Media Pvt Ltd.