Reading Time: 2 minutes

8 వేల మంది జాబ్స్ పీకేస్తున్న ఫేస్‌బుక్.. మే 20న ముహూర్తం ఫిక్స్

Caption of Image.

టెక్ ప్రపంచంలో ఫేస్‌బుక్ కంపెనీ మాతృ సంస్థ మెటా మరోసారి లేఆఫ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 ప్రారంభం నుండే ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం కొనసాగుతుండగా.. సోషల్ మీడియా దిగ్గజం మెటా తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మే 20, 2026న మెటా తన మొదటి విడత లేఆఫ్స్‌ను ప్రారంభించనుంది. ఇందులో 10 శాతం మంది ఉద్యోగులను, అంటే సుమారు 8వేల మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కంటే ఈసారి ఉద్యోగ కోతలు మరింత తీవ్రంగా ఉండవచ్చనే వార్తలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ లేఆఫ్స్ కేవలం మొదటి విడతతోనే ఆగిపోయేలా కనిపించటం లేదంటున్నారు నిపుణులు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 20 శాతం మేర వర్క్‌ఫోర్స్‌ను తగ్గించాలని మెటా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2024 డిసెంబర్ నాటికి మెటాలో దాదాపు 79వేల మంది పనిచేస్తుండగా.. వీరిలో 20 శాతం కోత అంటే దాదాపు 15 వేలకు పైగా ఉద్యోగాలు జాబ్స్ పోగొట్టుకోనున్నారు. 2022లో 11 వేల మందిని, 2023లో 10 వేల మందిని లేఆఫ్ చేసిన మెటా.. ఇప్పుడు అంతకంటే పెద్ద సంఖ్యలో రీస్టక్చరింగ్ ప్లాన్ చేస్తోంది.

ఈ భారీ ఉద్యోగ కోతలకు ప్రధాన కారణం AI. మెటా ప్రస్తుతం తన పూర్తి దృష్టితో పాటు నిధులను ఏఐ వైపు మళ్లిస్తోంది. ఏఐ రేసులో వెనుకబడకుండా ఉండటానికి మౌలిక సదుపాయాలు, కొత్త టాలెంట్ కోసం బిలియన్ల డాలర్లు వెచ్చిస్తోంది. ఈ భారీ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకునేందుకు కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మనుషుల కంటే ఏఐ వాడటంపైనే మెటా ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పటికే రియాలిటీ ల్యాబ్స్ విభాగాన్ని ప్రక్షాళన చేసిన మార్క్ జుకర్‌బర్గ్.. ఇంజనీర్లను కొత్తగా ఏర్పాటు చేసిన ‘అప్లైడ్ ఏఐ’ గ్రూప్‌లోకి మారుస్తున్నారు. ఇది కోడింగ్ రాయడం, సంక్లిష్టమైన పనులను నిర్వహించే ఏఐ ఏజెంట్లను తయారు చేస్తోంది. ఇది భవిష్యత్తులో మనుషుల అవసరాన్ని మరింతగా తగ్గిస్తుందట.

మెటా మాత్రమే కాదు.. 2026లో టెక్ పరిశ్రమ మొత్తం ఇదే బాటలో పయనిస్తోంది. Layoffs.fyi డేటా ప్రకారం.. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే 95 కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా 73వేల 200 మంది ఉద్యోగులను తొలగించాయని తేలింది. అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా ఆటోమేషన్, ఏఐ పేరుతో వేలాది మందిని పక్కన పెడుతున్నాయి. టెక్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటూ ఏఐకి పెద్దపీట వేస్తుండటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని రోజుల కిందట జరిగిన ఒరాకిల్ లేఆఫ్స్ తర్వాత మెటా ఉద్యోగులను తాకుతోంది లేఆఫ్స్ సునామీ. 

©️ VIL Media Pvt Ltd.