Reading Time: 2 minutes

బెంగళూరు కోర్టు సంచలన తీర్పు..పదేళ్ళ క్రితం హత్య కేసులో ఎమ్మెల్యే కు జీవిత ఖైదు

Caption of Image.

కర్ణాటకలో బీజేపీ నేత హత్యకేసులో బెంగళూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసులో  కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్  కులకర్ణికి జీవిత ఖైదు  శిక్ష విధించింది. ఈ తీర్పుతో కులకర్ణి అసెంబ్లీ నుంచి అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది. కులకర్ణితోపాటు దోషులుగా తేలిన మరో పదిహేను మందికి కూడా కోర్టు జీవత ఖైదు శిక్ష వేసింది. 

ప్రజాప్రతినిధులు కేసుల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సంతోష్ గజానన్ భట్.. 2016 లో జరిగిన బీజేపీ నేత యోగేస్ గౌడ హత్య కేసులో హత్య, ఉద్దేశపూర్వక కుట్ర సహా ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద కులకర్ణి, మరో పదిహేను మందిని ఇటీవల దోషులుగా తేల్చింది.  

పదేళ్ళ క్రితం హత్య కేసులో.. 

2016 జూన్ 15 న ధర్వాడ్ జెడ్పీ మెంబర్  యోగేష్ గౌడను జిమ్ లో వ్యాయామం చేస్తుండగా కొందరు దుండగులు హత్య చేశారు.  ఆ సమయంలో కర్ణాటకలో కులకర్ణి మంత్రిగా ఉన్నారు. ఈ హత్య కేసులో కులకర్ణికి సంబంధం ఉందని ప్రతిపక్షాలనుంచి ఒత్తిడి పెరగడంతో అప్పటి ప్రభుత్వం 2019లో సీబీఐ విచారణకు ఆదేశించింది. 

హత్య కుట్ర వెనుక అసలు కథ..

ఈ కేసులో  కులకర్ణిని సీబీఐ ప్రధాననిందితుడిగా ఛార్జీ షీట్ దాఖలు చేసింది.  యోగేష్ గౌడ రాజకీయ ప్రత్యర్థిగా ఎదుగుతున్నాడని అతడిని హత్య చేసేందుకు కిరాయి హంతకులను ఏర్పాటు చేశాడని సీబీఐ ఆరోపించింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో 2020లో కులకర్ణిని అరెస్ట్ చేశారు. 

2021 ఆగస్టులో కులకర్ణి  సుప్రీంకోర్టు నుంచి  బెయిల్ పొందారు. అయితే సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో 2025 జూన్‌లో సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. 2026 జనవరిలో బెయిల్ కోసం మరోసారి ప్రయత్నించారు కులకర్ణి.  ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు మళ్లీ బెయిల్ మంజూరు చేసింది. 

అయితే ఈ కేసులో అనేక విచారణల అనంతరం బెంగళూరు కోర్టు  ప్రస్తుతం ఎమ్మెల్యే గా ఉన్న కులకర్ణిని దోషిగా తేల్చింది. హత్య, ఉద్దేశపూర్వక కుట్ర సహా ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద కులకర్ణి, మరో పదిహేను మందిని ఇటీవల దోషులుగా తేల్చింది. ఏప్రిల్ 17, 2026(శుక్రవారం) న కులకర్ణికి జీవత ఖైదు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.   

©️ VIL Media Pvt Ltd.