Reading Time: < 1 minute

రాహుల్ నేతృత్వంలో ప్రతిపక్షాల ఐక్యత గెలిచింది..దేశ చరిత్రలో ఇవాళ సువర్ణ దినం: సీఎం రేవంత్

Caption of Image.

లోక్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.   దేశ చరిత్రలో ఈ రోజు సువర్ణ దినంగా  నిలిచిపోతుందన్నారు  రేవంత్ రెడ్డి.. నల్ల బిల్లులను ప్రతిపక్ష శక్తులు అడ్డుకున్నాయని చెప్పారు . రాహుల్ నేతృత్వంలో ప్రతిపక్షాల ఐక్యత గెలిచిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందన్నారు. బిల్లులను ఓడించిన ప్రతిపక్షనేతలకు కృతజ్ఞతలు తెలిపారు రేవంత్. స్టాలిన్, మమత,అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ నేతృత్వం అభినందనీయమని అన్నారు. కమ్యూనిస్టుల సహకారం కీలకమన్న రేవంత్..జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. 

వీగిపోయిన రాజ్యాంగ సవరణ  బిల్లు

లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. లోక్ సభలో  528మంది ఎంపీల ఓట్లకు గానూ అనుకూలంగా 298 ఓట్లు .. వ్యతిరేకంగా 230ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు మూడింట రెండో వంతు మెజార్టీ ఉండాలి. అంటే అనుకూలంగా 358ఓట్లు రావాల్సి ఉండగా.. కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు 54 ఓట్లు తగ్గాయి. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింక్ ఉన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా కోటాకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడంతో విపక్షాలు పూర్తిగా వ్యతిరేకించారు. 

డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్లను బీజేపీ పరిగణలోకి తీసుకోకుండా 131 రాజ్యాంగ సవరణ బిల్లు మద్దతు కోసం సభలో ఓటింగ్ కు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అయితే మ్యాజిక్ ఫిగర్  ఓట్లు రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. 

©️ VIL Media Pvt Ltd.