Reading Time: 2 minutes

స్పృహ తప్పినా వాళ్లకు అనవసరం.. షూటింగ్ సెట్‌లో నరకం చూపించారన్న స్వీడిష్ బ్యూటీ!

Caption of Image.

బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్.  ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్’, ‘మిక్కీ వైరస్’  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’, కోలీవుడ్ స్టార్ ధనుష్ ‘నేనే వస్తున్నా’ వంటి చిత్రాల్లో నటించడంతో పాటు డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్, సౌత్ చిత్ర పరిశ్రమల మధ్య వ్యత్యాసాల గురించి ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్లామర్ ప్రపంచంలో కనిపించే మెరుపుల వెనుక ఉండే ఒత్తిడిని ఆమె ఎండగట్టింది.

సౌత్ సెట్స్‌లో ప్రశాంతత !

సౌత్ సినిమాల్లో పనిచేయడం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఎల్లీ వెల్లడించింది. దక్షిణాది సినిమా సెట్స్‌లో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ ఎవరూ కేకలు వేయరు. ప్రతి ఒక్కరూ వాకీటాకీల ద్వారా పద్ధతిగా సంభాషించుకుంటారు అని ఆమె ప్రశంసించింది. దీనికి భిన్నంగా బాలీవుడ్ సెట్స్ ఎప్పుడూ రణగొణధ్వనులతో, హడావుడిగా ఉంటాయని ఆమె సైగలతో వివరించింది.

స్పృహ తప్పినా వాళ్లకు అనవసరం
 

బాలీవుడ్‌లో ఎదుర్కొన్న ఒత్తిడి గురించి షాకింగ్ విషయాలు చెప్పింది ఎల్లీ . బాలీవుడ్‌లో ఒక్కోసారి పని చాలా వేగంగా జరుగుతుంది. కనీసం భోజనం చేస్తున్నామా లేదా అని కూడా చూడరు. షాట్ రెడీ అయిపోయింది.. వచ్చేయ్ అని పిలుస్తారు. నువ్వు తిన్నావా? నీకు నీరసంగా ఉందా? నువ్వు స్పృహ తప్పి పడిపోతావా? అన్నది వాళ్లకు అనవసరం. కేవలం కెమెరా ముందుకు రావడమే వాళ్లకు ముఖ్యం అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అన్ని టీమ్స్ ఇలా ఉండవని, కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లలో మాత్రమే ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతాయని ఆమె స్పష్టం చేసింది.

►ALSO READ | ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. పర్సనాలిటీ రైట్స్ కోసం ఐకాన్ స్టార్ న్యాయపోరాటం!

టైప్ కాస్ట్ ముద్ర.. 

నటులను ఒకే రకమైన పాత్రలకు పరిమితం చేసే ధోరణి బాలీవుడ్‌లో ఎక్కువగా ఉంటుందని ఎల్లీ అభిప్రాయపడింది. నువ్వు అందంగా కనిపిస్తే, నిన్ను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారు. ‘మలంగ్’ సినిమాలో నా పాత్ర చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. నేను సీరియస్ రోల్స్ కూడా చేయగలనని ఎవరూ ఊహించలేదు అని చెప్పింది. నటీనటుల ప్రతిభను గుర్తించకుండా, వారి బాహ్య రూపాన్ని బట్టే అవకాశాలు ఇస్తారని ఆమె విమర్శించింది.

దక్షిణది వైపు మొగ్గు..

ఎల్లీ అవ్రామ్ కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా, తెలుగులో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. రీసెంట్‌గా 2025లో విడుదలైన ‘బీ హ్యాపీ’ (Be Happy) చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆమె తనను తాను కేవలం గ్లామర్ డాల్‌గా కాకుండా, ఒక పరిపూర్ణ నటిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. సౌత్ సినిమాల్లో లభిస్తున్న గౌరవం, ప్రశాంతత కారణంగానే ఇప్పుడు చాలామంది నటీనటులు టాలీవుడ్, కోలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారని ఎల్లీ మాటలను బట్టి అర్థమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..

 

©️ VIL Media Pvt Ltd.