
హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయని వాహనదారులు సిల్లీ రీజన్స్ చెబుతున్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. హెల్మెట్ పెట్టుకోకున్నా తన జుట్టు ఊడిందని చెప్పారు. హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందన్నారు డీజీపీ
డీజీపీ శివదర్ రెడ్డి ఏమన్నారంటే..‘ హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయట. చెవులు వినిపించవట. నెత్తినొప్పి వస్తుందట. వాహనదారులు చెబుతున్న ఈ సిల్లీ రీజన్స్ వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. మరి నేను నా జీవితంలో ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకోలేదు. మరి నా వెంట్రుకలు ఎందుకు ఊడిపోయాయి?. గుర్తుంచుకోండి హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందనేది కేవలం అపోహ మాత్రమే. కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రాణాలు పోతాయనేది చేదు నిజం. మనవాళ్లకు ప్రాణాల కంటే వెంట్రుకల మీదే ప్రేమ ఎక్కువైపోతోంది. హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్యే ఈరోజు ఎక్కువగా ఉంది.
మీ పిల్లల చేతికి బైక్ ఇస్తున్నారంటే వాళ్ల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మర్చిపోకండి. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం అంటే మృత్యువును ఆహ్వానించడమే. లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్ టేక్ చేయడం ప్రమాదకరం. ఎప్పుడూ కుడి వైపు నుండే ఓవర్ టేక్ చేసి, మళ్ళీ మీ లైన్‌లోకి వచ్చేయండి. ఫోర్ వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాల్సిందే.మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన డ్రైవింగ్ మాత్రమే కాదు, ఎదుటివాడు ఎలా నడుపుతున్నాడో కూడా గమనించాలి. హైవే మీద వెళ్లే వాహనానికే మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆ తర్వాతే మనం రోడ్డు ఎక్కాలి.ఇక ఆటో డ్రైవర్లు… మీరు కాకీ యూనిఫాం ధరించి విధుల్లోకి రావడం చాలా సంతోషం. సమాజంలో మీపై గొప్ప గౌరవం.
►ALSO READ | వృద్ధుడిని 15 రోజులు బంధించి.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 42 లక్షలు దోపిడీ
చేయి పోయినా, కాలు పోయినా అమర్చుకోవచ్చు కానీ… ప్రాణం పోతే తిరిగి తెచ్చుకోలేం. రోడ్డు భద్రత అనేది ఎవరో వచ్చి చెప్పాల్సిన విషయం కాదు, అది మన బాధ్యత. మనల్ని మనం కాపాడుకుందాం అనుకునే లోపే ప్రమాదం జరిగిపోతుంది’ అని అన్నారు.