
- ఈనెల 23లోగా 30 శాతం బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు ప్రభుత్వం హామీ
- 30 శాతం బిల్లులు చెల్లించకపోతే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి విచారణకు హాజరుకావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథ పథకంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా నిర్వహణ చేపట్టిన ఎన్‌సీసీ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన రూ.180.17 కోట్ల బిల్లులను రెండు నెలల్లోగా చెల్లించాలన్న గత కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఎన్‌సీసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు
. కోర్టు ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈనెల 23 తేదీలోగా మొత్తం బకాయిల్లో 30 శాతం బిల్లులు చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపునివ్వాలని ఏజీ కోరగా, న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈనెల 23లోగా 30 శాతం నిధులు విడుదల చేయని పక్షంలో తదుపరి విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి మళ్లీ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.