
- బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
- జంతర్ మంతర్ లో బీసీ మహిళల పోరుదీక్ష
న్యూఢిల్లీ, వెలుగు: సంపూర్ణ కులగణన జరిగిన తర్వాతే డీలిమిటేషన్, మహిళా బిల్లు తేవాలని కేంద్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సబ్ కోటపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. గురువారం ఢిల్లీ జంతర్ మంతర్ లో బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మనిమంజరి అధ్యక్షతన ‘బీసీ మహిళల పోరుదీక్ష’ను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..మహిళా బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం బీసీలను మరో 80 ఏండ్లు రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
దేశంలో జనాభా లెక్కలు, బీసీ కులాల లెక్కలు సేకరించిన తర్వాతే నియోజకవర్గాల పెంపు, మహిళా బిల్లులో జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు కోట కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డీ లిమిటేషన్ ద్వారా పెంచిన అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు మొత్తం మహిళా బిల్లు పేరుతో అగ్రకుల మహిళలకు కట్టబెట్టాలని కేంద్రం ఆలోచించడం చాలా దుర్మార్గమన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాకే మహిళా బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి జాజుల విజ్ఞప్తి చేశారు.