
దేవరకొండ, వెలుగు: విద్యుత్ రిపేర్ పనులు చేసిన కాంట్రాక్టర్కుబిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన నల్గొండ జిల్లా దేవరకొండ విద్యుత్ ఏడీఈ సైదులును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దేవరకొండలో వర్షాల వల్ల దెబ్బ తిన్న విద్యుత్ మరమ్మతు పనులకు సంబంధించి రూ.10 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు మంజూరు చేసేందుకు ఏడీఈ సైదులు 3 శాతం కమీషన్ డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్‌ను ఇబ్బంది పెట్టాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం ఏడీఈకి ఆఫీస్లో రూ.30 వేలు అందజేయగా, ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏడీఈని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.