Reading Time: 2 minutes

ఎల్ఆర్ఎస్ ఫైల్స్ ఎక్కడివక్కడే..! రెండో విడతలో 25.67 లక్షల అప్లికేషన్లు

Caption of Image.
  • 5.19 లక్షల మంది నుంచి రూ.1,750 కోట్ల రెగ్యులరైజేషన్​ ఫీజు వసూలు 
  • ఇప్పటివరకు 20 శాతం మందికే ప్లాట్ల రెగ్యులరైజ్​
  • ఏడాదిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు 
  • ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి నో క్లియరెన్స్​ 
  • తప్పించుకుంటున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు 

హైదరాబాద్, వెలుగు:  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో లేఅవుట్ రెగ్యులరైజేషన్​ స్కీమ్​(ఎల్ఆర్ఎస్) ఫైల్స్​ కదలట్లేదు. రెండో విడతలో ఈ స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిరుడు ఏప్రిల్ 30 నాటికి 5.19 లక్షల మంది నుంచి రూ.1,750 కోట్లు రెగ్యులరైజేషన్​ ఫీజు కింద వసూలు చేశారు. ఇందులోనూ ఇప్పటివరకు 20 శాతం మందికి మాత్రమే ఫ్లాట్ల రెగ్యులరైజ్  సర్టిఫికెట్లు అందజేశారు. ఫీజు కట్టిన లక్షల మంది ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 

ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి క్లియరెన్స్​ రాకపోవడం వల్ల రైగ్యులరైజేషన్​ చేయలేకపోతున్నామని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు తప్పించుకుంటున్నారు. గ్రేటర్​ హైదరాబాద్  పునర్విభజనతో కూడా దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేసి ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు మహానగర కార్పొరేషన్లుగా విభజించింది. కొత్తగా సర్కిళ్లు, డివిజన్లు, వార్డులు ఏర్పాటు చేయడంతో ఎల్ఆర్ఎస్​లకు సంబంధించిన ఏ ఫైల్ ఎక్కడుందో తెల్వని పరిస్థితి నెలకొంది.  

రూ.1,750 కోట్ల రెగ్యులరైజేషన్​ ఫీజు వసూలు​

అనధికార లేఅవుట్లను రెగ్యులరైజ్  చేసేందుకు గత బీఆర్ఎస్  ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​ తీసుకొచ్చింది. తొలి విడతలో కొద్దిపాటి ఫలితాలు మాత్రమే వచ్చాయి.   ఈ స్కీమ్​లో మార్పులు చేసి రెండో విడత 2020 ఆగస్టు 31న 131 జీఓ తీసుకొచ్చారు.  2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్డ్​ సేల్​ డీడ్​ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో కొనుగోలు చేసిన ప్లాట్లను మాత్రమే రెగ్యులరైజ్​ చేస్తామని జీఓలో పేర్కొన్నారు. డెవలపర్లు, ప్లాట్  యజమానులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. చార్జీల వసూలులో ఆలస్యం వల్ల అప్పుడు  స్కీమ్​ ఆగిపోయింది. 

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరి 2025లో జీఓ 28 ద్వారా  25 శాతం రాయితీ కల్పిస్తూ ‘వన్​ టైమ్ సెటిల్​మెంట్’ స్కీమ్​ తీసుకొచ్చి  18.60 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఫీజు చెల్లింపుల రాయితీ గడువును ముందుగా మార్చి 31గా నిర్ణయించి తర్వాత ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ  గడువులోగా రాష్ట్రంలో 5.19 లక్షల మంది  అప్లికేషన్  ఫీజు, రెగ్యులరైజేషన్​ చార్జీల కింద రూ.1,750 కోట్లు  చెల్లించారు. 

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే .. 

ఎల్ఆర్ఎస్​ స్కీమ్​లో డబ్బులు చెల్లించిన 5.19 లక్షల మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 20 శాతం మందికి మాత్రమే రెగ్యులరైజ్​ చేసినట్టు  మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి ప్రొసీడింగ్​ సర్టిఫికెట్లు ఇచ్చారు. ల్యాండ్​ వ్యాల్యూను బట్టి సర్కారుకు ఫీజు చెల్లించిన వారిలో 80 శాతం మందికి ఇంకా ప్రొసీడింగ్స్​ అందలేదు. దీంతో పట్టణాల్లో ఇళ్లు నిర్మించుకోలేక, అవసరానికి ప్లాట్లను ఇతరులకు అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్​ ఆఫీసుల చుట్టూ దరఖాస్తుదారులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా అధికారుల నుంచి సమాధానం రావట్లేదు. 

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంవల్లనే డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారులకు రెగ్యులరైజేషన్​ సర్టిఫికెట్లు అందడం లేదు.  ఫైల్స్​ క్లియర్​ చేయడంలో ఆయా శాఖల్లో  జాప్యం జరుగుతున్నట్టు  ఉన్నతాధికారులు చెబుతున్నారు.  దరఖాస్తులను టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్లు రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఆఫీసులకు పంపిస్తున్నారు. 

ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్, ప్రొహిబిటేడ్​ ల్యాండ్స్  గురించి పరిశీలించాల్సిన ఆయా శాఖల అధికారులు.. వేగంగా ఫైళ్లను క్లియర్​ చేయడం లేదు.  ఏ సమస్యలేని ఫైళ్లను కూడా  కొందరు ఆఫీసర్లు సర్వే నంబర్​ మిస్​మ్యాచ్, స్పెల్లింగ్​మిస్టేక్స్, డాక్యుమెంట్లు లేవన్న కారణాలతో ఆపేస్తున్నారని పలువురు  దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. 

గ్రేటర్​ హైదరాబాద్​లో ఏ ఫైల్ ఎక్కడుందో తెల్వని పరిస్థితి

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్​ఆర్​) వరకు విస్తరించింది. మూడు మహానగర కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించింది. పాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 4.16 లక్షల ఎల్ఆర్ఎస్​ దరఖాస్తులు రాగా వీటిలో 1.06 లక్షల మంది ఫీజు చెల్లించారు. 

వీరిలో 80 శాతం మంది లబ్ధిదారులకు రెగ్యులరైజేషన్​ చేసినట్లు ప్రొసీడింగ్​ సర్టిఫికెట్లు జారీకాలేదు. దీంతో వారికి సంబంధించిన ఫైల్స్​ ఎక్కడ, ఏ డివిజన్​ ఆఫీసులో ఉన్నాయో తెల్వని పరిస్థితి నెలకొంది. డివిజన్ల మార్పుల వల్ల అంతా గందరగోళంగా తయారైందని అప్లిక్యాంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.