
మధ్యప్రాచ్యంలో జరుగుతోన్న యుద్ధ ప్రభావం మహారాష్ట్రలోని అరటి వ్యాపారంపై పడింది. ఆశాజనకంగా సాగు మొదలుపెట్టిన రైతుకు అంతర్జాతీయ సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి. మహారాష్ట్రలో అరటి సాగుకు ప్రధాన కేంద్రాలైన జల్గావ్, సోలాపూర్ జిల్లాల్లో పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది.
ఎగుమతులకు మార్గం మూసుకుపోవడంతో.. వేల సంఖ్యలో అరటి కంటైనర్లు కోల్డ్ స్టోరేజీలకే పరిమితమయ్యాయి. విదేశాలకు వెళ్లాల్సిన నాణ్యమైన పంట రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఫిబ్రవరిలో రైతులకు కిలోకు రూ. 18 నుంచి రూ. 22 వరకు లభించేది. మార్చి నాటికి అది కిలోకు రూ. 8-10కి పడిపోయింది. ఏప్రిల్‌లో ధరలు మరింతగా పడిపోయి కిలోకు కేవలం రూ. 2-3కి చేరాయి.
►ALSO READ | ఢిల్లీలో సగం మందిలో కరోనా లాంటి లక్షణాలు: ఎందుకిలా.. డాక్టర్లు ఏమంటున్నారంటే..!
అంతర్జాతీయ మార్కెట్లకు చేరాల్సిన అరటి పండ్లు.. ఇప్పుడు దేశీయ మార్కెట్లకు పోటెత్తుతున్నాయి. దీంతో ధరలు అమాంతం పడిపోయి రైతులకు కనీస పెట్టుబడి కూడా రావడం లేదు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. కళ్ళముందే పంట కుళ్ళిపోతుంటే భరించలేక.. రైతులు తమ పంటలను నాశనం చేసుకుంటున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుండవచ్చు.. కానీ దాని తాలూకు ఆర్థిక విపత్తు మాత్రం మన రైతన్నల బతుకులను తలకిందులు చేస్తోంది.