Reading Time: < 1 minute

హైదరాబాద్ లో రూ. 5 లక్షలకే 102 గజాల ప్లాటు .. రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసం

Caption of Image.

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. శుభక్షేత్ర పేరుతో అమాయక పెట్టుబడిదారులకు ఎరవేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఘరానా మోసం బట్టబయలైంది. పటాన్‌చెరు, దామరగిద్ద ప్రాంతాల్లో వెంచర్ల పేరుతో నిందితులు భారీ వసూళ్లకు పాల్పడ్డారు. నిందితులు కపూరు హేమకాంత్ రెడ్డి, రామవత్ మధు,  సత్యనారాయణ చౌదరి కలిసి ఈ  స్కీమ్‌ను తెరపైకి తెచ్చారు. కేవలం పెట్టుబడి పెడితే చాలు 102 గజాల ప్లాట్‌తో పాటు, నెలకు 25 వేల రూపాయల చొప్పున 42 నెలల పాటు ఇస్తామని నమ్మబలికారు. అంతేకాకుండా అదనంగా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పారు.

వీరి మాటలు నమ్మి కాట్రిక సంతోష్ అనే బాధితుడు 5 లక్షల రూపాయలు చెల్లించగా.. అతనిలాగే మొత్తం 33 మంది బాధితుల నుంచి నిందితులు భారీగా డబ్బులు వసూలు చేశారు . ఒక్కొక్కరి దగ్గర రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా సుమారు 6 కోట్ల 58 లక్షల రూపాయలను నిందితులు కాజేశారని సమాచారం. ఈ సొమ్మంతా గోకుల నందన ఇన్‌ఫ్రా ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు పోలీసులు.

మోసం బయటపడింది ఇలా..

డబ్బులు తీసుకున్న తర్వాత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం ఒప్పంద పత్రాలతోనే కాలయాపన చేశారు. హామీ ఇచ్చిన నెలవారీ చెల్లింపులు కూడా నిలిపివేయడంతో బాధితులు నిలదీశారు. తమ డబ్బు తమకు ఇచ్చేయాలని కోరితే నిందితులు ఏకంగా బౌన్సర్లతో బెదిరింపులకు దిగారు.  దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై BNS 318(4), 316(2) సెక్షన్లతో పాటు TSPDFEA యాక్ట్ సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో జరిగే ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  పోలీసులు హెచ్చరిస్తున్నారు.

►ALSO READ | టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్.. ముంబై తుది జట్టు ఇదే

©️ VIL Media Pvt Ltd.