Reading Time: 2 minutes

తెలంగాణ నుంచి గల్ఫ్ వలసల్లో ఎస్సీలు, బీసీలే ఎక్కువ

Caption of Image.

తెలంగాణ ప్రభుత్వం 2024లో చేపట్టిన ఆర్థిక, సామాజిక, కుల గణనకు సంబంధించిన సర్వే వివరాలను బహిర్గతం చేసింది. తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని ఈ సర్వే బయటపెట్టింది.  రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు అగ్రవర్ణాల కంటే మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నారని నివేదిక వెల్లడించింది. 

బీసీలు కూడా అగ్రవర్ణాల కంటే 2.7 రెట్లు వెనుకబడి ఉన్నారు. మొత్తం 242 కులాల్లో 135 కులాలను ‘అత్యంత వెనుకబడినవి’గా గుర్తించారు. ఈ 135 కులాల్లోనే రాష్ట్ర జనాభాలో 67 శాతం మంది ఉన్నారు. ఈ కులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వెనుకబడి ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఎస్టీల్లో 99 శాతం, ఎస్సీల్లో 97 శాతం, బీసీల్లో 71 శాతం మంది ప్రజలు రాష్ట్ర సగటు కంటే వెనుకబడి ఉండటం ఆందోళన కలిగించే అంశం. 

  • ఉపాధి కోసం మహారాష్ట్ర,  కర్నాటకకు.. 

బతుకుదెరువు కోసం తెలంగాణ నుంచి వలసలు వెళ్లే వారి శాతం 1.1గా ఉంది. ఇలా వలస వెళ్లిన వారిలో 60.4 శాతం మంది ఇతర దేశాలకు  వెళ్లగా, 39.6 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. విదేశాలకు వెళ్లిన వారిలో 42 శాతం మంది గల్ఫ్ దేశాలకే వెళ్లడం గమనార్హం. అమెరికాకు వెళ్లిన వారి వాటా 17.8 శాతంగా ఉంది. బ్రిటన్  కు 14.5 శాతం మంది, ఆస్ట్రేలియాకు 2.6 శాతం మంది వెళ్లారు. యూరప్ దేశాలకు 7.6 శాతం మంది ఉపాధి కోసం వెళ్లారు. వలసలు ఎక్కువగా జగిత్యాల (3.8%)  నిజామాబాద్ (2.5%) జిల్లాల నుంచి ఉన్నాయి. 

  • గల్ఫ్ వలసల్లో ఎస్సీలు, బీసీలే ఎక్కువ

గల్ఫ్ వలసల్లో బీసీ వర్గాల వాటా 52.6 శాతం కాగా, ఎస్సీల వాటా 61.1 శాతంగా ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారిలో అగ్రవర్ణాల వారు 37.6 శాతంతో ముందున్నారు. ఈ డేటా ప్రకారం ఉత్తర తెలంగాణ నుంచి వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. పేదరికం నిరుద్యోగం వలసలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.  ప్రజలు వలస వెళ్లడానికి ప్రధాన కారణం ఉద్యోగం/ఉపాధి అని సర్వే వెల్లడించింది. సుమారు 29.1 శాతం మంది ఉపాధి కోసమే వలస వెళ్లగా, 20.5 శాతం మంది ఉన్నత చదువుల  కోసం వెళ్లారు. వ్యాపారాల నిమిత్తం 3.1 శాతం మంది వలస బాట పట్టారు. 

చదువు కోసం విదేశాలకు వెళ్లే వారిలో అమెరికా (17.8%)  బ్రిటన్ (14.5%) ప్రధాన గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారిలో మహారాష్ట్ర,  కర్నాటక వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలలో 30 శాతం మంది ఉపాధి కోసమే వెళ్తున్నారు. అగ్రవర్ణాలలో చదువు కోసం వెళ్లే వారి శాతం 43.8గా ఉండటం గమనార్హం. పట్టణ ప్రాంత యువత ఎక్కువగా ఉన్నత చదువుల కోసం, గ్రామీణ యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. ఈ గణాంకాలు రాష్ట్రంలోని ఉపాధి కల్పన  విద్యా వసతుల స్థాయిని సూచిస్తున్నాయి. వలస కార్మికుల సంరక్షణ కోసం ప్రత్యేక విధానాల అవసరమని ఈ నివేదిక వెల్లడించింది.

©️ VIL Media Pvt Ltd.