Reading Time: 2 minutes

హైవేలపై ప్రయాణించే వారికి హెచ్చరిక: మీ పాత FASTag బ్లాక్‌లిస్ట్ కావచ్చు.. వెంటనే ఇది చెక్ చేసుకోండి

Caption of Image.

రెగ్యులర్‌గా హైవేలపై ప్రయాణిస్తున్నారా? కారుకు FASTag ఉందా? అయితే త్వరలో బ్యాంక్ నుంచి మీకు ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావొచ్చు. ఎందుకంటే.. వాహన రిజిస్ట్రేషన్ వివరాలను వెరిఫికేషన్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) బ్యాంకులను ఆదేశించింది. ఒకవేళ వివరాల్లో తేడా ఉంటే.. ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్ చేసే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

NHAI ఆదేశాలకు కారణం..
టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ రీడర్లు స్కాన్ చేసినప్పుడు.. సిస్టమ్‌లో ఉన్న వాహనం నంబర్, కారుపై ఉన్న నంబర్ ప్లేట్ వేర్వేరుగా ఉంటున్నాయని NHAI గమనించింది. దీనివల్ల టోల్ ఫీజు ఎగవేతకు అవకాశం ఉండటమే కాకుండా.. ఇది మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. అందుకే ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే అన్ని బ్యాంకులు వెంటనే వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని హైవే అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.

పాత ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నవారికి ఎక్కువ రిస్క్..
ఈ సమస్య ప్రధానంగా ‘వాహన్’ డేటాబేస్ అనుసంధానానికి ముందు జారీ చేసిన పాత ఫాస్ట్‌ట్యాగ్ లలో ఎక్కువగా ఉంది. ఆ సమయంలో వివరాల నమోదు మాన్యువల్‌గా జరిగేది కాబట్టి.. కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు. ఇప్పుడు బ్యాంకులు ఈ పాత డేటాను ఆడిట్ చేస్తున్నాయి. ఒకవేళ మీ ఫాస్ట్‌ట్యాగ్ తప్పుడు నంబర్‌తో లింక్ అయి ఉన్నట్లు గుర్తిస్తే.. బ్యాంకులు దాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెడతాయి. అంటే టోల్ ప్లాజా వద్ద మీకు డిస్కౌంట్ రాదు సరే కదా.. మీరు క్యాష్ రూపంలో రెట్టింపు జరిమానా కట్టాల్సి రావచ్చు.

కొత్త టోల్ విధానం కోసం ముందస్తుగా..
భారతదేశం త్వరలోనే ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ టోలింగ్ వ్యవస్థకు మారబోతోంది. ఈ విధానంలో టోల్ ప్లాజాల వద్ద గేట్లు ఉండవు.. వాహనం వేగంగా వెళ్తున్నప్పుడే కెమెరాలు నంబర్ ప్లేట్‌ను గుర్తించి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ చేస్తాయి. ఇలాంటి సమయంలో డేటా కచ్చితంగా లేకపోతే తప్పుడు నోటీసులు జారీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ టెక్నాలజీ అమలుకు ముందే డేటాను క్లీన్ చేయాలని ప్రభుత్వం సదరు సంస్థలను ఆదేశించింది.

ప్రస్తుతానికి వెహికల్ ఓనర్లు కంగారు పడాల్సిన పనిలేదు. అయితే ఫాస్ట్‌ట్యాగ్ పాతదైతే అంటే3-4 ఏళ్ల క్రితం తీసుకున్నది.. ఒకసారి మీ బ్యాంక్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి కారు నంబర్ సరిగ్గా లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవటం బెటర్. ఒకవేళ తప్పుగా ఉంటే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి అప్‌డేట్ చేయించుకోండి. ఒకవేళ ఫాస్ట్‌ట్యాగ్ ఒకసారి బ్లాక్‌లిస్ట్ అయితే.. మళ్లీ దాన్ని యాక్టివేట్ చేసుకోవడం చాలా కష్టమైన పని. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడటం మేలు.

©️ VIL Media Pvt Ltd.