
హైదరాబాద్‌లోని బేగంపేట టూరిజం ప్లాజాలో డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఎం పార్టీ నేత రాములు నేతృత్వంలో జరిగిన ఈ చర్చలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
సీపీఎం నేత రాములు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ… నియోజకవర్గాల విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఇది చాలా కష్టకాలం. ఇది ప్రజల మేలు కోసం చేస్తున్న పని కాదు. దేశ ప్రయోజనాల కంటే కూడా బీజేపీ రాజకీయ లాభం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్ల కోసమే మహిళా బిల్లును తెరపైకి తెచ్చారు. దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రతి విషయాన్ని ఎన్నికల్లో గెలవడానికి వాడుకుంటున్నారు.
జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం ఎక్కువ సీట్లు కేటాయించి వరంలా మారుస్తున్నారు. ఇప్పటికే మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. ముస్లింలపై ద్వేషం పెరిగేలా చేశారు. ఇప్పుడు ప్రాంతాల పేరుతో దేశాన్ని విడగొడుతున్నారు.
తెలంగాణలోని బీజేపీ ఎంపీలను ప్రజలు ఈ విషయంపై నిలదీయాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు, నితీష్ కుమార్ వంటి నేతల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తోంది అని అన్నారు. డెలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యతను తగ్గించి, రాజకీయంగా లాభపడాలని కేంద్రం చూస్తోందని, దీనిపై అందరూ కలిసి పోరాడాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది.